calender_icon.png 6 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుతంగా నిమజ్జన వేడుకలు జరపాలి

06-09-2025 12:00:00 AM

బందోబస్తులో 350 మంది సిబ్బంది: డీసీపీ భాస్కర్

మంచిర్యాల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వెల్లడించారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయకుడికి అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవితో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా జిల్లా విలసిల్లి ఐక్యత, శాంతి మార్గంలో పయనించాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బందోబస్తు కోసం ౩౫౦ మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిమజ్జన శోభాయాత్రను డ్రోన్ కెమెరా సహాయంతో పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరిస్తామన్నారు.

దండేపల్లి మండలం గూడెం - రాయపట్నం బ్రిడ్జి వద్ద, లక్షెట్టిపేట గోదావరి పుష్కర ఘాట్, మంచిర్యాల గౌతమేశ్వర ఆలయం, సీతారాంపల్లి ఇంటెక్ వెల్, ఇందారం గోదావరి బ్రిడ్జి, చెన్నూర్ పెద్ద చెరువు, బెల్లంపల్లి పోచమ్మ చెరువుల్లో పెద్ద మొత్తంలో వినాయక నిమజ్జనం జరుగుతాయని, ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.