22 July, 2026 | 1:48 AM

విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘ప్రజాబాట’

22-07-2026 12:00 AM

మహబూబాబాద్, జులై 21 (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా ఎన్పీడీసీఎల్ సంస్థ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాలతో పాటు అత్యధికంగా ప్రజలు గుమిగుడే ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు విద్యుత్ ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన ముందస్తు చర్యలు, రక్షణ చర్యలను సులువుగా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు.

విద్యుత్ ప్రమాదాల నివారణకు ముఖ్యమైన సూచనలు:

1. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. 2. విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే 1912 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని గ్రామస్థులకు తెలియజేశారు.3. జీ ఐ (ఇనుప) వైర్లకు దండాలు మాదిరిగా కట్టి బట్టలు ఆరవేయకూడదు. 4. తడి చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విచ్లు ఆన్ చేయకూడదు.5. వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లకు తప్పనిసరిగా ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి. 

6. వర్షాకాలంలో విద్యుత్ ఐరన్ పోల్స్, స్తంభాలను తాకకూడదు. 7. నాణ్యమైన సర్వీస్ వైర్ను ఉపయోగించాలి.8.  ఇన్సులేషన్ ఫెయిల్ అయిన సర్వీస్ వైర్లను వెంటనే మార్చుకోవాలి.9. ట్రాన్స్ఫార్మర్ల (డి టి ఆర్) దగ్గర ఏవైనా సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇస్తే వారు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. 10. రైతులు స్వయంగా డీటీఆర్, ఏబీ స్విచ్లను ఆపరేట్ చేసి మరమ్మతు పనులు చేయకూడదు. ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి మాత్రమే సమాచారం ఇవ్వాలి. ప్రజా బాట  కార్యక్రమం ద్వారా రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించి, విద్యుత్ను సురక్షితంగా వినియోగించాలని సూచించారు. గ్రామస్థులు విద్యుత్ ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖకు సహకరించాలని కోరుతున్నారు.