హామీలపై ప్రశ్నిస్తే అసహనమా?
l సీఎం తన మూర్ఖత్వాన్ని మళ్లీ చాటుకున్నారు
l బీజేపీకి జోడీ అయినా, కేడీ అయినా రేవంత్‌రెడ్డినే
l మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు
సిద్దిపేట/హైదరాబాద్, ఏప్రిల్20 (విజయక్రాంతి): అబద్ధపు మ్యానిఫెస్టోలతో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హామీల గురించి అడిగితే మెదక్‌లో అసహనం వ్యక్తం చేసి మరోసారి తన మూర్ఖత్వాన్ని రేవంత్‌రెడ్డి నిరూపించుకున్నారని విమర్శించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో బీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల ప్రత్యేక సమావేశం అనంతరం మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడారు.
హామీలపై ప్రశ్నించినందుకు మెదక్‌లో అసహనంతో రాతియుగపు మనిషిలా రేవంత్ మాట్లాడారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్, మెదక్‌లోనే అభివృద్ధి జరిగిందన్న ఆయన.. ఇప్పుడు ఇందిరాగాంధీ అభివృద్ధి చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో రైలు ప్రయాణం, మూడు యూనివర్సిటీలు, మూడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చింది కేసీఆరేనని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ మ్యానిఫెస్టోలో పార్టీ మారిన వారిని సస్పెండ్ చేస్తామని చెబితే, ఇక్కడ రేవంత్‌రెడ్డి అందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. బీజేపీకి జోడీ అయినా, కేడీ అయినా రేవంత్‌రెడ్డియే అన్నారు. వెంకట్రామ్‌రెడ్డి లోకల్ కాదన్న రేవంత్‌రెడ్డి మల్కాజిగిరిలో పోటీ చెయ్యలేదా అని ప్రశ్నించారు.
ప్రస్తుత కరువులో మల్లన్నసాగర్ నీళ్లే హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారానికి దిక్కయ్యిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కరువైందని, ఒక్కరోజే రేవంత్‌రెడ్డి ప్రజలను కలిశారన్నారు. ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అకాలవర్షాలు, వడగండ్లతో రైతులు పంటలు, ధాన్యం తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే నష్టపోయిన రైతులను ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
ప్రభుత్వ వసతిగృహాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్‌పాయిజన్ ఘటనలపై హరీశ్ రావు విచారణ వ్యక్తంచేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతం మరువక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగులోకి రావడం ఆందోళనకరమన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తీసుకుని తీవ్ర స్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం బాధకరమన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి..
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పనిచేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, ఆచరణ మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని, కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. కంప్యూటర్ టీచర్లకు 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో అప్పులపాలై అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.






