‘దళితబంధు’కు రాజకీయ గ్రహణం
చారకొండలో అటకెక్కిన రెండో విడత అమలు
కలెక్టర్ ఖాతాలో రూ.27.90 కోట్లు ఉన్నా.. లబ్ధిదారులకు అందని వైనం
రెండేళ్లుగా ఎదురుచూస్తున్న 279 దళిత కుటుంబాలు
చారకొండ, మే 13: దళిత కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ‘దళితబంధు’ పథకం చారకొండ మండలంలో రాజకీయ వివాదాల మధ్య నిలగిపోయింది. రెండున్నరేళ్ల క్రితమే ఎంపికైన 279 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున రూ.27 కోట్ల 90 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్రౌండింగ్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ఇత ర పైలెట్ మండలాల్లో రెండో విడత పూర్తయినప్పటికీ, చారకొండలో మాత్రం ప్రక్రి య నిలిచిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిధులున్నా అమలు శూన్యం.
చారకొండ మండలంలో తొలి విడతలో 1,407 మంది దళితబంధు లబ్ధిదారులుగా ఎంపికై ప్రయోజనం పొందారు. అయితే సాంకేతిక కారణాలు, అవగాహన లోపం తదితర కారణాలతో అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన మరో 279 మందిని అధి కారులు రెండో విడత కోసం గుర్తించారు.
వీరి కోసం 2023 సెప్టెంబర్ నెలలో అప్పటి ప్రభుత్వం రూ.27.90 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభమే తరువాయి అనుకున్న తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయిం ది. అనంతరం ప్రభుత్వం మారినా, ఇప్పటివరకు నిధుల విడుదలపై స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారులు నిరీక్షణలోనే మిగిలిపోయారు.
రాజకీయ పంచాయితీలో నలిగిపోతున్న లబ్ధిదారులు.
గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన 279 మంది జాబితాలో అనర్హులు ఉన్నారనే అభ్యంతరాలను అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. వారిని తొలగించి అర్హులను చేర్చినా తర్వాతే నిధులు విడుదల చేయాలని పట్టుబడుతున్నారనే చర్చ స్థానికంగా జరుగుతోంది.
అయితే గతంలో జాబితా ఖరారై నిధులు మంజూరైన నేపథ్యంలో దానిలో మార్పులు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చడంతో పథకం అ మలుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రూ.10 లక్షల సా యం అందుతుందన్న ఆశతో ఉ న్న నిరుపేద దళిత కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి.
దళితబంధు లేదు.. ఇతర పథకాలు రావు.
దళితబంధు రెండో విడత లబ్ధిదారుల పరిస్థితి ప్రస్తుతం ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా మారింది. ప్రభుత్వ రికార్డుల్లో వీరిని ఇప్పటికే దళితబంధు లబ్ధిదారులుగా న మోదు చేయడంతో ఇతర ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆన్లైన్ వ్యవస్థలో దళితబంధు లబ్ధిదారులుగా నమోదై ఉండటంతో కొత్త పథకాలు వర్తించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటు దళితబంధు నిధులు అందక, అటు ఇతర ప్రభు త్వ సాయం పొందలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
అధికారుల మౌనం.. బాధితుల ఆందోళన
నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభించడంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చొరవ చూపడం లేదని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైలెట్ మండలమైన చారకొండపైనే ఎందుకు వివ క్ష చూపుతున్నారని ప్రశ్నిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా కలెక్టర్ ఖాతాలో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసి పెండింగ్లో ఉన్న గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దళిత బంధు, మైనార్టీ, బీసీ బంధు తాత్కాలికంగా నిలిపివేయాలని ఉన్నతాధికారులు తమకు ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన చారకొండ మండలంలో రెండో విడత లబ్ధిదారుల నిధులు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం.
గోపాల్, ఇంచార్జీ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్.






