14-11-2025 07:40:31 PM
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లు అందిస్తాం
- మార్కెట్ కు అనుగుణంగా ముందుకు వెళ్లాలి
- అందరూ భీమా పథకాలలో చేరాలి
- సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యధావిధిగా చేనేత జౌళి శాఖ కార్యాలయం సేవలు
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సమీక్ష సమావేశం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి యూనిఫాం చీరల క్లాత్ ఆర్డర్ లక్ష్యం చేరాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేనేత జౌళి శాఖ అధికారులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాములు, యజమానులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళా శక్తి యూనిఫాం చీరల క్లాత్ ఆర్డర్ కేటాయింపు, ఉత్పత్తిపై మాక్స్ సొసైటీలు వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్ ప్రకారం వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఈ నెల 24 వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ఆర్డర్లు అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే పరిశ్రమ బాధ్యులు సైతం మార్కెట్ ఆర్డర్లు పొందేలా ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు ఐడీఓసీలో ఉన్న చేనేత జౌళి శాఖ కార్యాలయం సిరిసిల్లలోని కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు. వస్త్ర పరిశ్రమలోని వారందరూ నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాల్లో నమోదు కావాలని సూచించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజనలో నమోదు కావాలని కోరారు. దీంతో వారి కుటుంబాలకు ఎంతో భరోసాగా ఉంటుందని, ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టీ అర్హులందరిని చేర్పించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కింద అమలు అవుతున్న పథకాల పూర్తి సమాచారం, సబ్సిడీ వివరాలతో కూడిన పంప్లేట్లు సిద్ధం చేసి, వస్త్ర పరిశ్రమ వారికి అందించాలని సూచించారు. ఆధునికత పై అవగాహన పెంచుకొని, నూతన పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని పేర్కొన్నారు.విద్యుత్, పాత బకాయిల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, డీఆర్డీఓ శేషాద్రి, ఎల్డీఎం మల్లికార్జున రావు, అధికారులు, సిబ్బంది, వస్త్ర పరిశ్రమ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.