03-05-2025 12:46:57 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయిగా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌సింగిల్‌ను రిలీజ్ చేశారు.
‘హృదయం లోపల’ అనే ఈ సాంగ్ ప్రోమో రెండు రోజుల క్రితం విడుదల కాగా విశేష స్పందన లభించింది. శుక్రవారం పూర్తి గీతం విడుదలైంది. ‘ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కలా.. ఏదో ఏదో అయ్యేంతలా ఉందే అలా.. ముంచేదిలా.. ఏవైపు పోనేపోనీ వీల్లేని దారే ఇదా.. అయినా ఆగిపోదు కదా.. చెప్పలేని ఇష్టమేగా.. ఏంటీ కథా.. చీకట్ల దారుల్లో నీ చూపే..’ అంటూ ప్రారంమైందీ గీతం. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చడంతోపాటు ఈ పాటను అనుమిత నదేశన్‌తో కలిసి అనిరుధ్ ఆలపించారు. ఈ గీతానికి కేకే సాహిత్యాన్ని అందించారు.
ఈ వీడియో సాంగ్‌లో కథ లోతును తెలియజేయడం ద్వారా సినిమా పట్ల ఆసక్తి, అంచనాలు రెట్టింపయ్యేలా చేసింది చిత్రబృందం. ఈ పాట విడుదల సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా స్పందించారు. “3’, ‘వీఐపీ’ చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయా.
నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పనిచేయాలి అనుకున్నా. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకు ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి గీతం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది” అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు. ఈ చిత్రానికి డీవోపీ: జోమోన్ టీ జాన్, గిరీశ్ గంగాధరన్; ఎడిటర్: నవీన్ నూలి.