09-12-2025 08:20:29 PM
రామాయంపేట (విజయక్రాంతి): రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఉమా సంజీవరెడ్డి ప్రచారం ఊపందుకుంది. ఇంటింటా తిరుగుతూ ప్రజలను పలకరించిన ఆయన, అభివృద్ధినే తన ఏకైక అజెండాగా ప్రకటించారు. “గ్రామ సేవే నా ధర్మం, అభివృద్ధే నా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలోని బీడీ కార్మికులు, నిరుపేదలు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా, పారదర్శకంగా అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా, మినీ వాటర్ ట్యాంకుల ఏర్పాటు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని వివరించారు.
ఆలయాల అభివృద్ధిలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు ఉమా సంజీవరెడ్డి తెలిపారు. గ్రామ దేవాలయాల అభివృద్ధి కోసం వ్యక్తిగత నిధులు వెచ్చించడానికి కూడా సిద్ధమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. “నా జీవితం సర్వస్వం ప్రజలకే అంకితం. గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం” అని భావోద్వేగంగా వెల్లడించిన ఆయన, లేడీస్ పర్స్ గుర్తుపై తమ మద్దతు నిలబెట్టాలని గ్రామస్థులను కోరారు. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామ రూపురేఖలను మార్చేలా పని చేస్తానని హామీ ఇచ్చారు.