09-12-2025 08:23:50 PM
ప్రజల్లో హామీల హీట్… గ్రామాభివృద్ధికి ‘రామన్న మేనిఫెస్టో’..
రామాయంపేట (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో సందడిగా మారింది. సర్పంచ్ అభ్యర్థి మానెగళ్ళ రామకిష్టయ్య చేపట్టిన ప్రచారానికి గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు భారీగా హాజరయ్యారు. ఇంటింటా పాదయాత్ర నిర్వహించిన రామకిష్టయ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామ స్థాయి సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్న రామకృష్ణయ్య “గ్రామం అభివృద్దే నా ఏకైక లక్ష్యం” అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ భవిష్యత్తుకు దారితీసేలా ‘రామన్న మేనిఫెస్టో’ విడుదల చేస్తూ పది హామీలను గ్రామస్థులకు అందించారు.
‘రామన్న మేనిఫెస్టో’ – ప్రజల కోసం పది హామీలు..
1. కోతుల బెడద నిర్మూలన – గ్రామంలో పెరుగుతున్న కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ.
2. ఆడపిల్ల జన్మకు గౌరవం – గ్రామంలో ఆడపిల్ల పుడితే కుటుంబానికి ₹5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్
3. నిరుపేదల పెళ్లిళ్లకు అండ – ఆర్థికంగా బలహీన వర్గాల వివాహాలకు ₹11,000 నగదు సహాయం.
4. మరణ సంస్కారాలకు సాయం – గ్రామంలో ఎవరు చనిపోయినా కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం.
5. సదాశివనగర్ తండాకు బీటీ రహదారి – గ్రామం నుంచి తండా వరకు పక్కా బ్లాక్‌టాప్ రోడ్డు.
6. మంచినీటి సమస్యలకు పరిష్కారం – నీటి ఇబ్బందులు ఉన్న ప్రతి గల్లీలో మినీ ట్యాంకుల నిర్మాణం.
7. పర్మినెంట్ వైకుంఠ రథం – గ్రామానికి శాశ్వతంగా వైకుంఠ రథాన్ని అందుబాటులో ఉంచడం.
8. మినీ ఫంక్షన్ హాల్ – గ్రామంలోని పెళ్లిళ్లు, వేడుకల కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం.
9. ప్రతి కులానికి కమిటీ హాల్ – బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కమిటీ హాళ్ల ఏర్పాటు.
10. బస్తీ దవాఖాన – గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం బస్తీ దవాఖాన స్థాపన.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన ఈ మేనిఫెస్టో గ్రామస్తుల్లో చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణయ్య హామీలు అమల్లోకి వస్తే ఝాన్సీ లింగాపూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలు ఓపికగా విన్న రామకృష్ణయ్య, విజయం సాధించిన వెంటనే ప్రతి హామీని కార్యరూపంలోకి తెస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో మార్పు కోసం రామన్న ఇచ్చిన ఈ మాటలతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.