సిరీస్ క్లీన్‌స్వీప్
చివరి టీ20లోనూ జింబాబ్వే చిత్తు
వైభవ్ సూర్యవంశీ మెరుపులు
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కైవసం
జింబాబ్వే టూర్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లోనూ ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో వరుసగా రెండు వైట్‌వాష్ పరాభవాల తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకున్నాడు.
హరారే, జూలై 26 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచినా వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. గత మ్యాచ్‌లో 20 పరుగులకే పరిమితమైన వైభవ్ ఈ సారి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన శైలిలో భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్‌తో కలిసి రెండో వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇషాన్ కిషన్ (29) ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ సాధించాడు. సెంచరీ దిశగా సాగిన వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులకు దగ్గర ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యవంశీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయసులోనే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ వరల్ రికార్డు సృష్టించాడు. కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ రికార్డును అతను దాటేసే అవకాశముంది.
తర్వాత శ్రేయాస్ అయ్యర్ 27, రింకూ సింగ్ 25, తిలక్ వర్మ 11 పరుగులు చేశారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది.ఛేజింగ్‌లో జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. తొలి బంతికే మయాంక్ యాదవ్ ఓపెనర్ బెన్నెట్‌ను ఔట్ చేశాడు. తర్వాత ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సికిందర్ రజా డకౌటయ్యాడు. ఇక్కడ నుంచి జింబాబ్వే కోలుకోలేకపోయింది. ర్యాన్ బర్ల్ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది.
మిగిలిన బ్యాటర్లలో కురాన్ 20, మియర్స్ 19, మెదెవెరె 28, మరుమని 1, బ్రాడ్ ఎవాన్స్ 14 పరుగులకే ఔటయ్యారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 157 పరుగులే చేయగలిగింది. బర్ల్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 , యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీసారు.మూడు మ్యాచ్ లలో 151 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 192/5 (వైభవ్ సూర్యవంశీ 81, ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 27, రింకూ సింగ్ 25, ఎవాన్స్ 2/41, మెదెవెరె 1/37, ముజరబాని 1/33)
జింబాబ్వే ఇన్నింగ్స్ : 157/7 (ర్యాన్ బర్ల్ 54, మెదెవెరె 28, కుర్రాన్ 20, మయాంక్ యాదవ్ 3/29, యశ్ ఠాకూర్ 2/45)






