calender_icon.png 25 January, 2026 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాట్రిక్‌పై గురి

25-01-2026 12:21:55 AM

నేడు కివీస్‌తో మూడో టీ20

సూపర్ ఫాంలో భారత్

బౌలింగ్ పైనే టెన్షన్

కివీస్ పుంజుకుంటుందా ?

టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు సూపర్ ఫామ్ కొనసాగుతున్న వేళ మరో సిరీస్ విజయానికి అడుగే దూరం.. సొంత గడ్డపై ఆధిపత్యం కనబరుస్తూ వరుసగా రెండు మ్యాచ్ లలో దుమ్మురేపిన టీమిండియా ఇప్పుడు హ్యాట్రిక్ సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లు ఫామ్ అందుకోగా.. బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అటు ఫీల్డింగ్ లోనూ కొంచెం బెటర్ అయితే గుహావటి లోనే సిరీస్ ఖాతాలో వేసుకోవడం ఖాయం

గుహావటి, జనవరి 24: కొత్త ఏడాదిలో తొలి సిరీస్ విజయానికి భారత్ అడుగుదూరంలో నిలిచింది. టీ20 ప్రపంచకప్‌కు ముం దు అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయినా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్‌లో మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో వరుసగా రెండు టీ20ల్లోనూ దుమ్మురేపేసింది. నాగ్‌పూర్, రాయ్‌పూర్‌లలో కివీస్ ను చిత్తు చేసి ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. తద్వారా గుహావటిలోనే సిరీస్ సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం భారత బ్యాటర్లు అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ చెలరేగితే.. రెండో టీ ట్వంటీలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్థిక్ అదరగొట్టారు. అయితే సంజూ శాంసన్ మాత్రం ఇంకా గాడిన పడలేదు. రెండు మ్యాచ్ లలోనూ నిరాశపరిచాడు. ఈ సిరీస్ లో సంజూ ఫామ్ అందుకోకుంటే మాత్రం ప్రపంచకప్‌లో తుది జట్టులో అతన్ని పక్కన పెట్టేసే అవకాశముంది. అలాగే శివమ్ దూబే, రింకూ సిం గ్ కూడా రాణిస్తున్నారు. మరోవైపు బౌలింగ్ మాత్రం కాస్త టెన్షన్ పెడుతోంది. గత మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ భారీగా పరుగులిచ్చి చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

హార్థిక్ పాండ్యా ఒక్కడే ఆకట్టుకోగా... హర్షిత్ రాణా కూడా నిరాశపరిచాడు. అటు స్పిన్న ర్లు మాత్రం కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. అయితే మూడో టీ ట్వంటీ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగడం ఖాయమని భావిస్తున్నారు. తొలి టీ ట్వంటీ లో గాయపడిన అక్షర్ పటేల్ రెండో మ్యాచ్ లో ఆడలేదు. ఒకవేళ కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తే కుల్దీప్ యాదవ్ స్థానంలో రీఎంట్రీ ఇస్తాడు. అలాగే స్టార్ పేసర్ బుమ్రా కూడా తుది జట్టులోకి రావడం ఖాయం. కానీ హర్షిత్ రాణా, అర్షదీప్ లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. 

మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే  న్యూజిలాండ్  ఈ మ్యాచ్‌లో విజ యం తప్పనిసరిగా మారింది.  బ్యాటింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ లో మాత్రం కివీస్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. డఫీ తప్పిస్తే మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను కట్టడి చేయాలంటే కివీస్ బౌలింగ్ గాడిన పడాల్సిందే. గత మ్యాచ్ లో భారీస్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతోనే ఓడిపోయింది. దీంతో తమ పేసర్లు ఫామ్ అందుకోవాలని కివీస్ మేనేజ్ మెంట్ ఎదురుచూస్తోంది. 

పిచ్ రిపోర్ట్ :

మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గుహావటి పిచ్ కూడా బ్యాటర్లకే అనుకూలం. తొలి రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీస్కోర్లు నమోదవుతాయని అంచనా. 2023లో ఇక్కడ టీ20 జరిగినప్పుడు ఆస్ట్రేలియా 222 పరుగుల టార్గెట్ ను ఛేదించింది.

తుది జట్లు అంచనా :

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, బుమ్రా/హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ : టిమ్ స్టిఫెర్ట్ , కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్ మన్, డారిల్ మిఛెల్ , శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫ్ఫీ