calender_icon.png 14 August, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సుంకాలకు భారత్ జంకదు !

10-08-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రం ప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయ ని అంతా భావించారు. కాని, కొంతకాలం నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.

పరస్పర ప్రతీకార సుంకాలు, వలసల డిపోర్టే షన్, వీసాలు, ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’, రెమిటెన్స్, ఆపరేషన్ సిందూర్ విషయంలో ట్రంప్ జోక్యం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఆ నిర్ణయాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్‌పై ప్రతికూల ప్రభా వం చూపుతున్నాయి. ట్రంప్ సుంకాలపై తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ ఎగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు అమలులోకి వచ్చాయి. ట్రంప్ ఏకపక్షంగా ఈ నిర్ణయా న్ని తీసుకున్నారు.

రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు ట్రంప్ భారత్‌పై మరో 25 శాతం జరిమానా విధిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేకాక, భారత్, రష్యా ‘డెడ్ ఎకానమీ’ దిశగా వెళ్తున్నాయని, రష్యా, భారత్‌ను ఉద్దేశించి‘వాళ్లిద్దరూ కలిసి మునిగిపోనీయండి, మాకేం సంబంధం లేదు’ అని ట్రంప్ నిష్ఠురమాడటం శోచనీయం. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన మాట వినడం లేదనీ, బ్రిటన్‌తో సాఫీగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకున్న భారత్, తన ప్రయోజనాలు కాపాడుకునే నేపథ్యంలో అమెరికా వాణి జ్య ఒప్పందం పట్ల కొంత కఠినంగా ఉండ టం వల్ల ఈ రెండు దేశాలపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్నది.

ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీ య సంస్థల ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అలాగే, సగటు వార్షిక వృద్ధిరేటు 6 శాతం కంటే ఎక్కువ. ఇది అమెరికా, చైనా వృద్ధిరేటు కంటే కూ డా అధికం.

ప్రపంచ వృద్ధిలో భారత్ భాగస్వామ్యం 18 శాతంగా ఉంటే, అమెరికా భాగస్వామ్యం కేవలం 11 శాతం మాత్రమే. కాబట్టి, ఏ ప్రమాణాలతో ట్రంప్ భారత్‌ను ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణిస్తున్నారనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ను ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణించడం, భారత్ ప్రతిష్ఠతో పాటు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టుగానే భావించాలి.

ట్రంప్ ద్వంద్వ వైఖరి..

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి న తర్వాత సుంకాల విషయంలో భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయం కలుగుతోంది. భారత్, అమెరికా వస్తు దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తోందని, కొన్నిసార్లు అది 100 శాతంగా ఉంటుందని, కాబట్టి భారత్‌ను ట్రంప్ ‘టారిఫ్ కింగ్’ అని ఎద్దేవా చేస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత్ సగటున 18 శాతం టారిఫ్ విధిస్తుండగా, భారత్ నుండి ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా సగటున 5 శాతం మాత్రమే టారిఫ్ విధిస్తున్నది.

కాబట్టి, ‘మా వస్తువులపై మీరు ఎంత టారిఫ్ విధిస్తున్నారో, మేమూ మీ వస్తువులపై అంతే టారిఫ్ విధిస్తాం’ అని ట్రంప్ మాట్లాడుతున్నారు. 2024-25లో భారత్ అమెరికాకు 87 బిలియన్ డాలర్ల విలువ గల వస్తువులను ఎగుమతి చేస్తే, 46 బిలియన్ డాలర్ల విలువ గల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది. అంటే, 41 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు భారత్‌కు ఏర్పడటం కూడా ట్రంప్‌కు కంటగిం పుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్‌ను మిత్రదేశంగా అభి వర్ణిస్తూనే, వాణిజ్యం విషయంలో భారత్ మంచి భాగస్వామి కాదని, భారత్‌పై సుం కాల మోత మోగిస్తూ, పాకిస్థాన్‌పై మాత్రం సుంకాలను 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించి ట్రంప్ తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకున్నారు. సుంకాల విష యంలోనే కాదు.. ఆపిల్ లాంటి సంస్థ తయారీ యూనిట్‌ను భారత్‌లో పెట్టవద్ద ని, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వవద్దనీ తన భారత వ్యతిరేక వైఖరిని ట్రంప్ బయటపెట్టుకున్నారు.

నిర్ణయాలు వాళ్లెలా చెప్తారు?

భారత్ రష్యాతో వ్యాపారం చేస్తూ, చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై మరో 25 శాతం అద నంగా సుంకం విధిస్తున్నామని చెప్పే హక్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎక్కడిది? భారత్ ఎవరితో వ్యాపారం చేయా లో, ఎవరితో కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు చేసుకోవాలో అమెరికా అధ్యక్షు డు ఎలా నిర్దేశిస్తాడు. రష్యా నుంచి ఒక్క భారత్ మాత్రమే కాదు.. చైనా కూడా పెద్దఎత్తున చమురు దిగుమతి చేసుకుంటు న్నది.

భారత్ తన చమురు అవసరాల్లో 38 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, చైనా 47 శాతం దిగుమతి చేసుకుంటున్నది. ట్రంప్ అయినప్పటికీ భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. ఉక్రెయిన్‌లో నరమేధా నికి చమురు దిగుమతి ద్వారా రష్యాకు భారత్ సహకరిస్తున్నదని చెబుతున్న ట్రం ప్, యురేనియం, రసాయనిక ఎరువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ‘మీ సంగతేమిటి ?’ అనే ప్రశ్నకు ట్రంప్ వద్ద సమాధానం ఉంటుందా? కచ్చితంగా ఉం డదు.

రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు, ట్రంప్ తో పాటు పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, భారత్ లాంటి మిత్ర దేశంతో సంబంధా లు దెబ్బతినే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్, రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకోవడమే కాకుండా, తమ సొంత కరెన్సీలతో వాణి జ్యం చేయాలని ఒప్పందం చేసుకోవడం ట్రంప్‌కు ఏమాత్రం నచ్చడం లేదు.

బ్రిక్స్ కూటమిలో రష్యా, చైనా, భారత్ ప్రధాన భాగస్వాములు. ఆ దేశాలు తమ సొంత కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే, డాలర్ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, బ్రిక్స్‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా భావించి, బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ డిమాండ్, సప్లులకు అనుగుణంగా కాకుం డా, సుంకాల కత్తిని ఎలాపడితే అలా ట్రం ప్ వాడితే, భవిష్యత్తులో అది అమెరికాకే దెబ్బకావచ్చు.

చైనాతో సుంకాల యుద్ధాన్ని మొదలుపెట్టి, చివరికి రాజీపడిన అమెరికా అధ్యక్షుడు, భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాల విషయంలో ఎలా వ్యవహ రించబోతున్నారనేది కీలకం. వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ను లొంగదీసుకునే ఎత్తుగడల్లో భాగంగానే ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అమెరికా, భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ, ప్రపంచంలోనే అతిపెద్ద మానవ వనరులు, మార్కెట్ కలిగిన దేశంతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం.

సుంకా ల విషయంలో ట్రంప్ పునరాలోచన చేయకపోతే, మెక్సికో, కెనడా, చైనాల వైఖరిలాగే భారత్ వైఖరి కూడా ఉండాలనే భావన వ్యక్తమవుతోంది. కెనడాను అమెరికాలో 51వ రాష్ర్టంగా ‘కలిపేయండి’ అని, కెనడాపై ఇష్టారీతిన సుంకాలు పెంచినప్పు డు నొప్పి ఎలా ఉంటుందో అమెరికాకు కూడా తెలిసి వచ్చేలా చేస్తామని కెనడా స్పందించిన తీరు, సుంకాల పెంపును ట్రంప్ కొంతకాలం పాటు వాయిదా వేసుకునేందుకు దోహదపడింది.

అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం జరగాల్సిన తరుణంలో, సంప్రదింపులు జరుగు తున్న వేళ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాల విధింపు నిర్ణయం సరైనది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసా య, డెయిరీ, పౌల్ట్రీ లాంటి రంగాల్లో అమెరికా ఒత్తిడికి, ప్రతిపాదనలకు భారత్ అంగీకరించకపోవడం కూడా ట్రంప్ ఆగ్రహానికి ఒక కారణంగా కనబడుతోంది.

భవిష్యత్తులో రష్యా, ఇండియా, చైనాలు ఒక కూటమిగా ఏర్పడితే, అది అమెరికా ప్రయోజనాలను, ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుందని అమెరికా అధ్యక్షు డు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే, భారత ప్రధాని మోదీ చైనా పర్యటన, రష్యా అధ్యక్షుడు పుతిన్.. భారత్ పర్యటన ఖరారు కావడం చూస్తుంటే, అమెరికా బెదిరింపులకు భారత్ భయపడదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

 వ్యాసకర్త సెల్: 98854 65877