calender_icon.png 16 August, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులాంతర వివాహాలపై కులోన్మాద దాష్టీకాలు

10-08-2025 12:00:00 AM

సమాజంలో నేడు సామాన్య ప్రజ లు తీవ్రమైన ఆర్థిక అసమానత లు ఎదుర్కొంటున్నారు. అట్టడుగు వర్గా లు ఆకలికి అలమటిస్తూ బతుకును వెళ్లదీస్తున్నాయి. యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. ఇవన్నీ ఒకవైపు అయి తే.. నాణేనికి మరోవైపు అన్నట్టు దేశంలో పాశ్చాత్య సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతున్నది.

వ్యాపార ప్రకటనలు, రీల్స్, సినిమాలు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ అశ్లీలాన్ని పెంచి పోషిస్తున్నాయి. భారత మార్కెట్ వ్యవస్థ కూడా వాటినే ప్రోత్సహిస్తున్నాయి. విచ్చలవిడి, అర్థం లేని కథ నాలతో నిరంతరం హింసను ప్రోత్సహిస్తున్నది.సినిమా రంగం సమాజంలోకి జొప్పి స్తున్న సినిమాలు కూడా ఇదే కోవలో ఉంటున్నాయి. మొబైల్‌లో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా.. అసాంఘిక, అశ్లీల కంటెంట్ సప్లు చేసే సంస్థలకు వరంగా మారింది.

ఇవన్నీ నేటి పిల్లలను వినియోగదారులుగా మార్చాయి. పిల్లలను కూడా మార్కెట్ విస్తరణలో భాగం చేశాయి. తల్లిదండ్రులు కుటుంబ పోషణ నిమిత్తం, ఉద్యోగ రీత్యా బయటకు వెళ్తున్న నేపథ్యం లో పిల్లలు పసితనం నుంచే ఇళ్లలో ఒంటరిగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఆపేక్ష ఉంటుంది, కానీ పరిస్థితులు వారిని నిస్సహాయులుగానే మిగులుస్తున్నాయి. అమ్మాయిలు తమ పట్ల ప్రేమగా, స్నేహంగా ఉన్న వ్యక్తులతో స్నేహంగా పలకరించినా, చనువుగా ఉన్నా ఈ సమాజం ఒప్పుకోదు.. వారిని వెంటాడుతూనే ఉంటుంది.

వేగంగా విస్తరిస్తున్న సామ్రాజ్యవాదం ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్, యూట్యూబ్ లాంటి సాధనాల ద్వారా ఒంటరి జీవితాలకు దూరపు మనుషులను సైతం దగ్గరకు తీసుకువచ్చింది. లీటర్ పాల ప్యాకెట్‌పై పడే జీఎస్టీకి సమానమైన డబ్బుతో, వారం రోజులకు సరిప డా అన్‌లిమిటెడ్ డేటా పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పర్యావసానంగా, పిన్న వయస్సులోనే ఇంట్లో కూర్చుని పిల్లలు పరిచయాలు పెంచుకోవడం, ప్రేమించుకోవడం, పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టు కొచ్చిన పబ్, డేటింగ్ లాంటి ‘కల్చర్స్’ను అలవాటు చేసుకుంటున్నారు. ఇవి ప్రభుత్వాలు సామ్రాజ్యవాదాన్ని విస్తరింపజేయ డానికి కల్పిస్తున్న పరిస్థితులే.

సామాజిక సంబంధాలు.. వివాహాలు

తల్లిదండ్రులిద్దరూ కష్టజీవులుగా ఉన్న సమాజంలో, ఒంటరిగా జీవితాన్ని ఈడ్చుకుంటూ మంచిచెడులకు గురైన పిల్లల విషయంలో ‘పెంపకంలో లోపం’ అని వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇక సంబంధాలు, పెళ్లిళ్ల విషయానికొస్తే.. స్నేహ సంబంధాలు పెళ్లికి దారితీస్తే అవి ప్రేమ పెళ్లిళ్లు. అదే పెద్దలు నిర్ణయించే సం బంధాలు కట్టుబాట్ల మధ్య జరిగితే.. అవి సంప్రదాయ పెళ్లిళ్లు.

అయితే, మొదటి రకం పెళ్లిళ్లు స్నేహంతో మొదలై, ఒకరినొకరు అర్థం చేసుకుని, కలిసి జీవిద్దామని ముందుకు వచ్చి, వాగ్దానాలతో ఒకటయ్యే వి. ఇవి ఎక్కువగా సమాజం గీసిన కులం, మతం అనే గీతలను చెరిపేసి తీసుకునే నిర్ణయాలు. ఇవి కులాంతర వివాహాలు, లేదం టే మనందరి అవగాహన ప్రకారం కుల రహిత సమాజానికి దోహదపడేవి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ కులరహిత సమాజం కోసం సమాజానికి ఇచ్చిన సందేశం కూడా ఇదే.

ఈ పెళ్లి ళ్లు సమాజంలో పూర్తిగా ఆచరణలోకి రాలేదు. అందుకు కారణం మనది కుల సమాజం కావడమే. ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా ఆ పాలకులు కులాలకే పెద్దపీట వేస్తుంటారు. ఎందుకంటే, నేడు కులం అధికారం సాధించడానికి, వనరుల పై ఆధిపత్యం చలాయించడానికి పనికొచ్చే సాధనంగా, పెట్టుబడిగా మారింది. అధికారానికి దగ్గరగా ఉండే ఆధిపత్య కులాలు పాలకులుగా, దూరంగా మిగిలిన కులాలు పాలితులుగా మారారు.

అయితే, ఆధిపత్య కులాలు అధికారం లేక సమాజంపై తమకున్న పట్టును కోల్పోయినప్పుడల్లా అవ మానంగా భావించి, కులానికి ‘పరువు’ అనే అహాన్ని తొడుక్కున్నాయి. కులంతో పరువును తిరిగి పొందేందుకు, ఆ పరువు ను ఎప్పటికీ నిలబెట్టుకోవడానికి హింసకు పాల్పడటం, హత్యల ద్వారా మనుషులను నిర్మూలించడం వరకు ఈ ఆధిపత్య కుల సమాజం ఎదిగింది.

మనువాదాన్ని ఆచరించే వీరు, ఇళ్లలో ఉండే ఆడపడుచుల జీవన విధానాన్ని పూర్తిగా శాసిస్తారు. పూర్తిగా పితృస్వామ్య సమాజంగా ఏర్పడి, ఆడపడుచుల ఇష్టాయిష్టాలను కూడా పరువు చట్రంలో భాగంగానే చూస్తారు. రాను రాను ఈ సంప్రదాయం విడిపోయి ఉన్న అట్టడుగు వర్గాల/పాలితుల సమాజానికి కూడా పాకింది. ఇప్పుడు అక్కడ కూడా పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి.

వివాహ వ్యవస్థ - విలువలు

ఇక సంబంధాలు నిర్ణయించే విషయానికొస్తే, హిందూ సమాజంలో దగ్గరి సం బంధాలలో పెళ్లిళ్లు చేసుకోవద్దని, కొన్ని కులాలకు ఆంక్షలు విధిస్తే, ఇంకొన్ని కులాలకు అదే సమాజం సబబే అని ఆచరణ లో పెట్టింది. ఆస్తులు కూడబెట్టుకోవడానికే మరియు ఇతర వాణిజ్య అవసరాల కోసమే ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతాయి. మేనరికం పెళ్లిళ్లు కూడా ఈ కోవకే చెందుతాయి. అలాగే, సమాన హోదా కలిగిన వ్యక్తుల మధ్య జరిగే పెళ్లిళ్లకు కులంతో సం బంధం లేకున్నా, హోదాను ఆస్తిగా భావిం చి చేసుకున్న పెళ్లిళ్లుగానే అవి అనిపించుకుంటాయి.

ఇస్లాం మతంలో తోబుట్టు వులకు మినహా, దగ్గరి బంధుత్వంలో కూడా ఎవరైనా ఎవరితోనైనా పెళ్లి చేసుకు నే స్వేచ్ఛ ఉంది. క్రిస్టియన్, బౌద్ధ సమాజాల్లో కూడా అలాంటి స్వేచ్ఛే ఉంది. అలాంటి ఆచారాలు ఇప్పటికీ సమాజం లో ఉన్నాయి. ఈ మతాల్లో కట్నం ప్రస్తావన తక్కువ అనే అభిప్రాయం ఉంది. కాని, ఇప్పుడు అక్కడ కూడా కట్నం తీసుకుంటున్నారని వార్తలు మనం చూస్తు న్నాం. ప్రపంచం ఉనికిలోకి వచ్చి, నాగరికత వెలిసే వరకు కేవలం లింగత్వం ఆధా రంగా సంబంధాల కొనసాగింపు ఆచరణలో ఉండేది. అది ఇప్పటికీ నాగరికతకు దూరంగా బతుకుతున్న కొన్ని తెగల్లో కొనసాగుతూనే ఉంది.

నాగరికత చెందిన సమాజం ప్రపంచానికి ఇచ్చుకున్న గొప్ప కానుక కుటుంబ వ్యవస్థ అని చెప్పుకొంటారు. అయితే, స్నేహ సంబంధాలతో కొత్త కుటుంబాలు వెలిసి, మరో మెరుగైన సమాజ పురోగమనాన్ని కొనసాగించవచ్చనే ఆలోచనను కూడా ఆహ్వానించా ల్సిందే. అది నేటి సమాజానికి అవసరం కూడా. కానీ, నేడు కులం కేంద్ర బిందువుగా ఉండి, అధికారం దాని చుట్టూ తిరిగే సమాజంలో అలాంటి పెళ్లిళ్లు ఆచరణ సాధ్యం కావడం కష్టతరమవుతుంది. అది మరిన్ని పరువు హత్యలకు దారితీస్తుంది. కులాలను మోసే ప్రభుత్వాలు, అధికారానికి దూరంగా విడిపోయిన కులాలను పట్టించుకోవు. కాబట్టి, కులరహిత, స్నేహభావంతో కూడిన నూతన సమాజ నిర్మా ణం కోసం నూతన ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పరచుకోవడమే మన లక్ష్యం కావాలి.

 పీఎం రాజు రాష్ట్ర పౌర హక్కుల సంఘం సభ్యుడు