యోధుడా సెలవు!
సునీల్ ఛెత్రి అల్విదా
కెరీర్ ఆఖరి పోరు ‘డ్రా’
క్రికెట్ మత్తులో జోగుతున్న భారత అభిమానులను ఫుట్‌బాల్ వైపు మళ్లించిన యోధుడు అతడు!
మైదానంలో వెలవెలబోయే ఖాళీ స్టాండ్స్‌ను నీలిరంగు జెర్సీలతో నింపిన వీరుడు అతడు!
సాకర్ యవనికపై భారత ఫుట్‌బాల్ కంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చిన ధీరుడు అతడు!
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి జాతీయ జట్టు తరఫున ఆడిన చివరి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భాగంగా గురువారం సాల్ట్ లేక్ స్టేడియంలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 0 ‘డ్రా’గా ముగించింది. 2026 ఫిఫా వరల్డ్‌కప్ దిశగా భారత్ ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్‌లో విజయం కీలకమైన దశలో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత జట్టు తీవ్రంగా కృషి చేసినా.. ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో విజయంతో కెరీర్‌ను ముగించాలనుకున్న ఛెత్రి ఆశ నెరవేరలేదు. ఈ ఫలితంతో భారత్ క్వాలిఫయర్ మూడో రౌండ్‌కు వెళ్లే మార్గం మరింత కఠినమైంది. 2005 జూన్ 11న పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో గోల్‌తో మెరిసిన ఛెత్రి.. చివరి మ్యాచ్‌లో ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయాడు. జాతీయ జట్టు తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన 39 ఏండ్ల ఛెత్రీ అందులో 94 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన వారిలో నాలుగో స్థానంతో కెరీర్ ముగించాడు. పోర్చుగల్ స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో (128), ఇరాన్ దిగ్గజం అలీ దాయి (108), అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (106).. ఛెత్రి కంటే ముందున్నారు.
‘మన దేశానికి అసలు ఫుట్‌బాల్ జట్టు ఉందా’ అనే చోటు నుంచి.. టీమిండియా సాకర్ మ్యాచ్ ఆడుతున్న మైదానం బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టించిన ఘనుడతడు. ఉపఖండంలో ఎవరికీ పెద్దగా పట్టని సాకర్‌కు.. అభిమానులతో బ్రహ్మరథం పట్టించిన శూరుడు అతడు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే.. ఫుట్‌బాల్‌లో దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ అంటే మాటలు కాదు. ప్రత్యర్థులు కవ్విస్తున్నా.. గిట్టనివాళ్లు గేలి చేస్తున్నా.. పల్లెత్తు మాట తూలకుండా ఉండటం సాధ్యమా! అందులోనూ ఫీల్డ్‌లో ప్రత్యక్షంగా ప్రత్యర్థితో కలిసి పరుగులు తీసే ఫుట్‌బాల్‌లో అది దాదాపు అసాధ్యమే! అలాంటి చోట కూడా సౌమ్యంగా ఉంటూనే సత్తాచాటడం అందరి వల్ల అయ్యే పనేనా.. కానీ ఒక్కడు మాత్రం దాన్ని సుసాధ్యం చేసి చూపాడు. 19 ఏళ్ల కెరీర్‌లో ఏనాడూ వివాదాల జోలికి పోకుండా.. ఆటను అందలమెక్కించిన ఆ వీరుడే సునీల్ ఛెత్రి. “ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.. ఫలితాన్ని ఆశించకు” అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. సహచరుల నుంచి సహకారం లభించకపోయినా.. ప్రత్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా.. ఏరోజూ వెన్నుచూపని ఆ మౌనముని అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో పాకిస్థాన్‌తో పోరు ద్వారా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఛెత్రి గురువారం అశేష అభిమాన సందోహం మధ్య తుది మ్యాచ్ ఆడేశాడు.
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన ఛెత్రి.. కెరీర్‌లో లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు. ఫుట్‌బాల్‌పై పెద్దగా ఆసక్తి కనబర్చని ఉపఖండంలో అనితర సాధ్యమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సాకర్‌లో కొనసాగుతున్న ప్లేయర్లలో అత్యధిక గోల్స్ చేసిన మూడో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన ఛెత్రి.. ఆల్‌టైమ్ హయ్యస్ట్ గోల్ స్కోరర్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. అర్జున, ఖేల్త్న్ర వంటి క్రీడా పురస్కారాలతో పాటు.. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్న ఛెత్రీ.. భారత ఫుట్‌బాల్‌కు ఎనలేని సేవ చేశాడు. క్రికెట్‌ను మతం.. సచిన్‌ను దేవుడిగా కొలిచే అభిమానులే ఎక్కువ ఉన్న మన దేశంలో.. సాకర్‌కు ఈ మాత్రం ఆదరణ దక్కుతోందంటే.. అది ముమ్మాటికీ ఛెత్రి చలవే! అసాధారణమైన ఫిట్‌నెస్, అద్భుతమైన స్కిల్స్‌తో పాటు.. అనుకువైన వ్యక్తిత్వం అతడిని అందరికంటే మిన్నగా నిలిపింది. పుష్కర కాలానికి పైగా భారత ఫుట్‌బాల్ జట్టు సారథిగా కొనసాగుతున్న ఛెత్రి.. చివరి మ్యాచ్‌లో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించడం సుస్పష్టం. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అల్విదా చెప్పాడు. ఫిట్‌నెస్‌లో తనకు తానే సాటి అనిపించుకున్న ఛెత్రి.. మరో రెండేళ్ల పాటు ఆడే సత్తా ఉన్నా మానసికంగా సిద్ధంగా లేని కారణంగానే తప్పుకుంటున్నట్లు ముందే వివరించాడు.






