13 July, 2026 | 4:22 AM

రైజర్స్ రై రై

03-05-2024 01:25 AM

రాజస్థాన్ రాయల్స్ జోరుకు హైదరాబాద్ బ్రేక్

మెరిసిన భువనేశ్వర్, నటరాజన్, దంచికొట్టిన నితీశ్, క్లాసెన్, హెడ్

ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రాయల్స్‌పై రైజర్స్‌దే పైచేయి అయింది. ఉప్పల్‌లో ఉత్కంఠ ఊపేసిన పోరులో చివరి బంతికి హైదరాబాద్ గట్టెక్కింది. మొదట తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డితో పాటు.. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ రాణించడంతో రెండొందల పైచిలుకు పరుగులు చేసిన సన్‌రైజర్స్.. ఆనక కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని లక్ష్యానికి ఒక పరుగు దూరంలో ఆపేసింది. యశస్వి, పరాగ్ పోరాడినా.. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ వేశాడు. 

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: మొదట బ్యాటింగ్ చేస్తే చాలు.. ప్రత్యర్థిని భయపెట్టే స్కోరుతో ఈ సీజన్‌లో భారీ విజయాలు నమోదు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అదే ఫార్ములాతో విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లో లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైన రైజర్స్.. ఈ సారి మొదట బ్యాటింగ్ చేసి తిరిగి గెలుపు బాట పట్టింది. సొంతగడ్డపై గురువారం జరిగిన పోరులో హైదరాబాద్ ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరు గులు చేసింది.

తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫో ర్లు, 8 సిక్సర్లు) భారీ సిక్సర్లతో ఉప్పల్‌ను ఊపేయ గా.. ట్రావిస్ హెడ్ (44 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. స్కోరు రెండొందలు దాటినా.. ఇటీవలి కాలం లో రైజర్స్ హిట్టింగ్ చూసిన వారికి అది స్వల్ప స్కోరు అనిపించడంలో తప్పేం లేదు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (0), సంజూ శాంసన్ (0) సున్నాలు చుట్టడంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (49 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. అయితే అవసరమైన సమయంలో హెట్‌మైర్ (13), పావెల్ (27), ధ్రువ్ జురెల్ (1) విఫలమవడంతో రాయల్స్‌కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, కమిన్స్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  

నితీశ్ అదుర్స్

గతానికి భిన్నంగా దూకుడే మంత్రంగా సాగుతున్న సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ధాటిగా ఆడే సత్తా ఉన్న అభిషేక్ శర్మ (12) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఇంపాక్ట్ ప్లేయర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ (5) విఫలమయ్యాడు. ఈ దశలో హెడ్‌తో జత కట్టిన నితీశ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మరోవైపు తన వైఖరికి విభిన్నంగా హెడ్ నెమ్మదిగా ఆడగా.. నితీశ్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. రైజర్స్ బాదుడును ఆస్వాదించేందుకు ఉప్పల్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులకు నితీశ్ పైసా వసూల్ పర్ఫార్మెన్స్ చూపాడు. ఆఖర్లో క్లాసెన్ కూడా దంచుడు మొదలు పెట్టడంతో రైజర్స్ అలవోకగా రెండొందల స్కోరు దాటింది. ఛేదనలో జైస్వాల్, పరాగ్ మెరుపులతో ఒక దశలో హైదరాబాద్ పరాజయం ఖాయమనిపించినా.. బౌలర్లు రాణించి మ్యాచ్‌ను కాపాడారు. చివరి ఓవర్‌లో రాయల్స్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. భువీ 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.