22-01-2026 12:00:00 AM
ఆటలో గెలుపోటములు సహజం. ఒక మ్యాచ్‌లో ఓడినా మరో మ్యాచ్‌లో గెలిచి పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశముంటుంది. కానీ ప్రస్తుతం భారత్ క్రికెట్ మాత్రం ఈ విషయంలో గడ్డుస్థితిని ఎదుర్కొంటుంది. మన దేశానికి పర్యటనకు వచ్చే విదేశీ జట్లకు భారత్‌ను సొంతగడ్డపై ఓడించడం సవాల్‌తో కూడుకున్న పని. గతంలో పలు సందర్భాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లకు భారత్ సిరీస్ కోల్పోయినా ఫుంజుకున్న దాఖలాలున్నాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైనట్లుగా అనిపిస్తున్నది. గతేడాది నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా పతనం ప్రారంభమయింది. కనీసం కొత్త ఏడాదినైనా విజయంతో ప్రారంభిస్తుందనుకుంటే ఇక్కడ కూడా మనకు నిరాశే ఎదురైంది.
రెడ్ బాల్ (టెస్టు క్రికెట్) నుంచి వైట్‌బాల్ (పరిమిత ఓవర్లు) ఆటకు మారినా భారత క్రికెట్ జట్టు ఓటముల పరంపర మాత్రం ఆగలేదు. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓటమిపాలైన టీమిండియా 37 ఏళ్ల తర్వాత ఆ జట్టుకు ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, టాప్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నిజానికి భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టులో ఎనిమిది మంది కొత్త మొహాలే అయినప్పటికీ క్రమశిక్షణతో కూడిన ఆట తీరుతో ఆ జట్టు వన్డే సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. 2021లో లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత గతేడాది భారత గడ్డపై ఆడిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేసి టీమిండియాను దెబ్బతీసింది.
అయితే గత రెండేళ్లలో చూసుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫెవరెట్‌గా బరిలోకి దిగింది. టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని భావించినప్పటికీ భారత్ మాత్రం ఓటమి వైపు నిలిచి అవమానం మూటగట్టుకుంది. ముఖ్యంగా ప్రణాళికా లోపాలు, గందరగోళ వ్యూహాలతో టీమిండియా తడబడుతున్నది. బ్యాటింగ్‌లో నిలకడలేమి.. బౌలింగ్‌లో ప్రభావం చూపకపోవడం జట్టును ఘోరంగా దెబ్బ తీస్తున్నాయి. దీనికి తోడు భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్పష్టమైన వ్యూహాలు సైతం భారత ఓటమికి కారణంగా పేర్కొనవచ్చు. ఒకప్పుడు భారత ఆటగాడిగా దూకుడును ప్రదర్శించిన గౌతమ్ గంభీర్ కోచ్‌గా మాత్రం ఆ స్థాయి అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
ఫామ్‌లో లేని ఆటగాళ్లను పదే పదే ఆడిస్తూ అక్షర్ పటేల్ వంటి యువ ఆటగాళ్లను పక్కన పెట్టడం గంభీర్ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నాడు. కోచ్‌గా తాను బాధ్యతలు చేపట్టాక సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలకు టెస్టు సిరీస్‌లు కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్ తాజా వన్డే సిరీస్ ఓటమి మరింత ఒత్తిడిలోకి నెట్టేసింది. ఈ ఓటములతో కెప్టెన్ గిల్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ల పరిస్థితి కూడా కఠినంగా మారింది. డిపెండింగ్ చాంపియన్ హోదాలో వచ్చే నెలలో స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న టీమిండియా ఆటను మెరుగుపరుచుకొని మరోసారి టైటిల్ సాధిస్తే తప్ప ఈ చర్చకు ముగింపు ఉండదు.