22-01-2026 12:00:00 AM
తెలంగాణ పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రాతిపదికన బాధితులకు మరింత చేరువై మానవీయ కోణంలో సేవలం దించేందుకు తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగం సీఐడీ ఒక కీలక నిర్ణ యం తీసుకుంది. ఇది పౌరులకు, బాధితులకు శుభ పరిణామం. ఇకపై బాధితులు ఠాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల నివాసానికి లేదా వారు కోరిన ప్రదేశానికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదుచేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
దేశంలోనే మొదటిసారిగా పౌర కేంద్రీత పోలీసింగ్‌లో భాగంగా ఈ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చినట్లు సీఐడీ విభాగం డీజీపీ చారుసిన్హా పేర్కొన్నారు. ప్రత్యేకించి మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్థి సంబంధిత వివాదాల్లో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ నిరోదక చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం.. ఇలాంటి కేసుల్లో బాధితులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం ఇబ్బందిగా మారిపోయింది. ఈ తరుణంలో పోలీసులే నేరుగా వారి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
‘ఒక ఫోన్ చేస్తే చాలు..ఇంటి వద్దకే అధికారి’ నూతన విధానం ప్రకారం నేరం జరిగినప్పుడు బాధితుడు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అం దించిన వెంటనే సంబంధిత పోలీసు అధికారి బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి సమాచారం సేకరించడం, బాధితుల ఫిర్యాదు స్వీకరించడం, వెంటనే స్టేషన్‌కు పంపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. రిజిస్టర్ ఆయిన ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితుడికి అందజేస్తారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత నిబంధనల ప్రకారం అక్కడిక్కడే సాక్షాల సేకరణ, బాధితుల స్టేట్మెంట్ రికార్డింగ్ వంటి చర్యలు చేపడుతారు.
సమాచారం అందిన వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ సహా ఏ రూపంలోనైనా కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యేలా చూస్తారు. ఈ విధానం వల్ల కేసు దర్యాప్తులో జాప్యం లేకుండా, సాక్షాధారాలను తారుమారు కాకుండా పారదర్శకంగా దర్యాప్తుకు ఆస్కారం ఉంటుందని సీఐడీ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ యూనిట్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఈ నూతన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినందుకు ప్రత్యేక అభినందనలు. బాధితుల గౌరవానికి హక్కులకు భంగం కలగకుండా వృత్తి పరమైన సేవలు అందించడమే తమ లక్షమని సీఐడీ మరోసారి పునరుద్ఘాటించింది. దీంతో పోలీస్ వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుపై పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగు లక్ష్మీనారాయణ, కరీంనగర్