ఇందిరా పార్కుకు పూర్వవైభవం తేవాలి
- నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలి
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 9 (విజయక్రాంతి): నగర నడిబొడ్డున ఉన్న ప్రతి ష్టాత్మక ఇందిరా పార్క్‌ని తిరిగి ప్రజలను ఆకర్షించేలా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధి కారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరంలో పారిశుద్ధ్యం, ఉద్యానవనాల పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సా రించిన కమిషనర్ కర్ణన్ సోమవారం ఉదయం ఇందిరా పార్క్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్కులోని పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతుల లేమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్కులో పలుచోట్ల పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సీ అండ్ డీ వేస్ట్, చెత్తాచెదారాన్ని గమనించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యర్థాలను తక్షణమే అక్కడి నుంచి తొలగించి, పార్కు ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఇందిరా పార్కుకి వచ్చే చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ప్లే ఏరియా చాలా కాలంగా వినియోగానికి నోచుకోకపోవడంపై ఆయన ఆరా తీశారు. పాడైపోయిన ఆట వస్తువులకు, ప్లే ఏరియాకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి వీలైనంత త్వరగా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని సం బంధిత విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ వాసులకు ఆహ్లాదాన్ని పంచే ఇందిరా పార్క్ను మరింత శుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించి నగర పౌరులను విశేషంగా ఆకర్షించేలా సమగ్ర అభివృద్ధి చర్యలు చేపట్టాలని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. కమిషనర్ కర్ణన్ వెంట జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ డెప్యూటీ కమిషనర్ డీసీ పుష్పలత, అర్బన్ బయోడైవర్సిటీ యూబీడీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎస్డబ్ల్యూఎం ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




