11-05-2025 09:56:55 PM
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ,(విజయక్రాంతి): రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం, కంచనపల్లి గ్రామాల వద్ద ఘనపూర్ నుండి నవాబ్ పేట ప్రధాన కాలువ పూడికతీత, చెట్ల తొలగింపు, లేవలింగ్ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటి పారుదల శాఖ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కంచనపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఘనపూర్ నుండి నవాబ్ పేట ప్రధాన కాలువ మారమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాన కాలువతో పాటు 10 డిస్ట్రిబ్యూటరీస్ లు, సబ్ కెనాల్స్ లలో పూడికతీత, చెట్ల తొలగింపు, లేవలింగ్ పనులు ముమ్మరంగా జరుతున్నాయని అన్నారు.
శ్రీమన్నారాయణపురం వద్ద ఇసుక మేటల తొలిగింపు, చెట్ల తొలగింపు, కంచనపల్లి వద్ద కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వర్షాకాలం, యాసంగి వరకు ఈ కాలువ ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని వచ్చే యాసంగి వరకు మొత్తం కెనాల్ సిసి లైనింగ్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి సిసి లైనింగ్ పూర్తి అయితే రానున్న 50 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన పంట పొలాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. కంచనపల్లి గ్రామంలో ఇప్పటికే సుమారు 85లక్షల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కంచనపల్లి గ్రామానికి 60 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని, రెండవ విడతలో మరో 40ఇల్లు మంజూరు ఇస్తానని తెలిపారు. కంచనపల్లి నుండి బాంజీపేట వరకు త్వరలోనే బీటి రోడ్డు మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు.
దేనబండ నుండి కమలాపురం వరకు అదనపు విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు ఎంపీ నిధుల నుండి మంజూరు ఇప్పిస్తానని అన్నారు. అన్ని పనులు ఒకేసారి చేయడం అంటే కష్టమని రానున్న 3ఏళ్లలో కంచనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలో గతంలో చేతకాని దద్దమ్మలు ఉండేవారని విమర్శించారు. 10ఏళ్ల బిఆరఎస్ పాలనలో ఒక్కరికీ ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో నియోజకవర్గానికి 3వేల 500ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయాని అన్నారు. కొంత మంది కావాలని రాజకీయం చేస్తున్నారని, అయినా చెత్త మాటలు మాట్లాడే వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
బిఆరఎస్ అధికారం కోల్పోయిన అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బాగుపడ్డది ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని అన్నారు. ఒక్క వారికే వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, లగ్జరీ ప్యాలెస్ లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు ఎస్ఈ సుధీర్, ఈఈ వినయ్ బాబు, డీఈ రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.