calender_icon.png 13 May, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సీతక్క

12-05-2025 05:40:57 PM

ములుగు,(విజయక్రాంతి): ప్రజలకు మాట ఇస్తే తప్పుకునేది లేదు.. ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యం, కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... గత సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోగా ఆ క్షణమే స్థానిక కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి బాదిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నిత్యవసర వస్తువులను, దుస్తులను అందజేయడం జరిగిందని, స్వచ్ఛంద సంస్థల ద్వారా బాధిత కుటుంబాలకు సహాయం కూడా అందించామని చెప్పారు. అగ్ని ప్రమాద బాధితులు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవసరమైన సహాయ కార్యక్రమాలను ఐటీడీఏ ద్వారా చేపట్టి ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి భూమి పూజ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. వేసవిలో తాగునీటికి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఐటీడీఏలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు పాటు ఇందిరమ్మ ఇండ్లను కూడా కేటాయించడం జరిగిందన్నారు. నిలువ నీడలేని పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మిస్తామని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారికి ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మధ్యవర్తులకు ఏమాత్రం అవకాశం కల్పించడం లేదని స్పష్టం చేశారు. పూర్తిగా నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జి, మంగపేట తహసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో బి.బద్రు, ఎంపీఓ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.