7 April, 2026 | 5:58 PM

పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్

07-04-2026 04:41 PM

చివ్వెంల: పేదల స్వంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సాకారం అవుతుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బధ్యతండా గ్రామంలో బానోతు సైదమ్మ, కృష్ణల నూతన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత పాలకులు పది సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

మండల వ్యాప్తంగా మొదటి విడతలో 545 ఇళ్లను మంజూరు చేయగా, ప్రస్తుతం అవన్నీ పూర్తి కావస్తున్నాయని చెప్పారు. మొదటి విడతలో ఇండ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండవ విడతలో అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత అమలులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్యల సహకారంతో అర్హులందరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.