20-08-2025 12:28:09 AM
-ఆడియో కాల్ లీక్...సోషల్ మీడియాలో వైరల్
-ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్
-పాలకీడు మండలంలోని జానపహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు
-గ్రామపంచాయితీ కార్యదర్శి వెంకటయ్యపై ఏసీబీ కేసు నమోదు
-ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్..?
హుజూర్ నగర్ (పాలకీడు) ఆగస్టు 19: తాను అడిగిన డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు అవుతుందంటూ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుడిని 2శాతం కమిషన్ ఇవ్వాలని లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని ఈ కమిషన్లో ఏఈ,డీఈలకు కూడా వాటా ఉంటుందని బెదిరింపులకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి కాల్ రికార్డింగ్ను బయట పెట్టిన లబ్ధిదా రుడు సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజక వర్గంలో పాలకీడు మండలంలోని జాన్ పహడ్ పంచాయతీ కార్యదర్శి మాట్లాడిన ఆడియో కాల్ లీక్... సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరు అవకత వకలపై జిల్లా కలెక్టర్ ను సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేసినందుకు గాను జాన్ పహాడ్ గ్రేడ్-4 గ్రామపంచాయతీ కార్యదర్శి ఇ వెంకయ్యను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలెట్ గ్రామం అయిన జాన్పహాడ్లో పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారుల నుండి కమిషన్ డిమాండ్ చేసి విధులపట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను జాన్ పహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకయ్యను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
క్రమశిక్షణ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు వెంకయ్య సస్పెన్షన్ లో కొనసాగుతారని,సస్పెన్షన్ సమయంలో ఎట్టి పరిస్థితులలో జాన్ పహాడ్ గ్రామాన్ని వదిలి వెళ్ళకూడదని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.కాగా జాన్ పహాడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్య మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి లంచం డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం విషయం తెలిసిందే. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా, లంచం తీసుకున్నా, నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.అలాంటి వారిని విధుల నుండి సస్పెండ్ చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం పట్ల ప్రజాప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలిపారు.