01-01-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 31 : మనీలాండరింగ్ కేసులో పరారీలో ఉన్న అంతర్జాతీయ నేరగాడు రావు ఇంద్రజిత్ యాదవ్ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీతో పాటు హరియాణాలోని గురుగ్రామ్, రోహతక్ ప్రాంతాల్లో ఉన్న పది ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. ఐదు లగ్జరీ కార్లు, బ్యాంక్ లాకర్లు, సుమారు 17 లక్షల నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్లు, డిజిటల్ డేటాను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
’జెమ్ ట్యూన్స్’ మ్యూజిక్ కంపెనీ యజమాని అయిన ఇంద్రజీత్ యాదవ్ ప్రస్తుతం యూఏఈలో తలదాచుకుంటూ అక్కడి నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతేడాది రోహతక్‌లో ఒక ఫైనాన్షియర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంద్రజీత్ మనీలాండరింగ్, బలవంతపు వసూళ్లు, ఆయుధాలతో బెదిరింపులు వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తుపాకుల నీడలో ఆర్థిక వివాదాల సెటిల్‌మెంట్లు
సోషల్ మీడియాలో మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్న ఇంద్రజీత్ సెలబ్రిటీలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ తన విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శించేవారు. వందల కోట్ల విలువైన ఆర్థిక వివాదాలను తుపాకుల నీడన సెటిల్ చేస్తూ భారీగా కమీషన్లు పొందేవారని ఈడీ స్పష్టం చేసింది. ఈ అక్రమ సంపాదనతో స్థిరాస్తులు, ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ కనీస ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారని దర్యాప్తులో తేలింది.
కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ ఫైనాన్షియర్ల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు ఈయన ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈయనపై ఇప్పటికే 15కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు, హరియాణా సింగర్ రాహుల్ ఫాజిల్ పూరియాపై జరిగిన దాడుల్లో ఈయన పేరు బయటకు వచ్చింది. విదేశీ కనెక్షన్లతో సాగుతున్న ఈ మనీ ట్రైల్ నెట్‌వర్క్ (డబ్బు ప్రవాహ గుర్తింపు)పై అధికారులు ఇప్పుడు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.