01-01-2026 12:00:00 AM
చండీగఢ్, డిసెంబర్ 31 : హరియాణాలోని ఫరీదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న వ్యాన్‌లో 28 ఏళ్ల ఓ మహిళపై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ సోమవారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తుండగా ఓ వ్యాన్ ఆమె వద్ద ఆగింది. ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు ఆమెను వాహనంలోకి ఎక్కించుకున్నారు.
అనంతరం వ్యాన్‌ను గుర్గావ్ రోడ్డు వైపు మళ్లించి, సుమారు రెండున్నర గంటల పాటు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఎంత వేడుకున్నా వినిపించుకోకుండా బెదిరింపులకు దిగారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఎస్జీఎమ్ నగర్‌లోని రాజా చౌక్ సమీపంలో ఆమెను కదులుతున్న వ్యాన్ నుంచి బయటకు తోసేశారు.
బాధితురాలికి తీవ్ర గాయాలు
వ్యాన్ నుంచి తోసేయడంతో బాధితురాలి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న బాధితురాలు తన సోదరికి ఫోన్‌లో విషయం తెలపగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖానికి అయిన గాయాలకు వైద్యులు 10 నుంచి 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, తీవ్ర షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో గొడవల కారణంగా ప్రస్తుతం దూరంగా ఉంటోంది.
ఘటనకు ముందు రోజు రాత్రి తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళుతున్నట్లు సోదరికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నేరానికి వాడిన వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు కోలుకున్న తర్వాత ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.