జర్నలిస్టులకు అన్యాయం
ఎక్కులూరి నాగార్జున్‌రెడ్డి :
ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలతో సమానంగా పత్రికా లేదా మీడియా రంగం పనిచేస్తుంది. అందుకే.. ఈ రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటాం. సమాజంలో ప్రజల గొంతుకను జర్నలిస్టులు ప్రభుత్వానికి వినిపిస్తారు. అలాంటి జర్నలిస్టుల గోడు నేడు వినే వారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తాజా బడ్జెట్ వరకు, అన్ని బడ్జెట్లలోనూ జర్నలిస్టులంటే చిన్న చూపే కనిపించింది.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అక్షర యోధుల సంక్షేమం గురించి పట్టించుకున్న ప్రభుత్వమే లేదు. జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లలో ఇళ్ల స్థలాలు అత్యంత కీలకమైనవి. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు ప్రతి ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేసిన దాఖలాలు లేవు. తాజా బడ్జెట్‌లో జర్నలిస్టుల హౌసింగ్ కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు లేకపోవడం అన్యాయానికి పరాకాష్ఠ. సుప్రీంకోర్టు తీర్పు సాకుతో గత ప్రభుత్వం కాలయాపన చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడవడం జర్నలిస్టు లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
సొంత గూడు లేక అరకొర జీతాలతో అద్దె ఇళ్లలో మగ్గుతున్న వేలాది మంది జర్నలిస్టుల గోడు పట్టించుకుని తీరాల్సిందే. జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంబంధించి గతంలో ప్రకటించిన రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ పంపిణీలో ఇప్పటికీ స్పష్టత లేదు. అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టులకు విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం మొక్కుబడిగా మారింది.పెరిగిన ధరల దృష్ట్యా ఈ నిధిని కనీసం 500 కోట్లకు పెంచాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేకపోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డులు (ఈహెచ్‌ఎస్) కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు జర్నలిస్టుల హెల్త్ కార్డులను స్వీకరించడం లేదు. ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలే ఇందుకు ప్రధాన కారణం. బడ్జెట్లో ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. దీనివల్ల జర్నలిస్టులు అత్యవసర సమ యాల్లో అప్పులపాలవ్వక తప్పడం లేదు.
వర్కింగ్ జర్నలిస్టులతో పాటు రిటైర్డ్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి నగదు రహిత వైద్యం అందించేలా బడ్జెట్లో వెసులుబాటు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం జర్నలిజం ముఖచిత్రం పూర్తిగా మారింది. సోషల్ మీడియా, వెబ్ సైట్లు, డిజిటల్ మీడి యా ద్వారా వార్తలు వేగంగా అందుతున్నాయి. ప్రభుత్వం అక్రిడిటేషన్ల జారీలో మాత్రం పాత పద్ధతులనే అనుసరిస్తోంది. కొత్తగా వచ్చే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో స్పష్టత లేదు.
దీనివల్ల వందలాది మంది ఫీల్డ్ జర్నలిస్టులు బస్ పాసులు, టోల్ మినహాయింపు వంటి ప్రభు త్వ రాయితీలకు దూరమవుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో కనీసం 500 కోట్లునా కేటాయించి ఉండాల్సి ఉంది. జర్నలిస్టు కాలనీల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు గౌరవప్రదమైన పెన్షన్‌అందించేలా ఒక శాశ్వత విధానాన్ని రూపొందించాలి. బకాయిలు చెల్లించి హెల్త్ కార్డులను అన్ని ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేలా చూడాలి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపే జర్నలిస్టులను శత్రువులుగా చూడకూడదు. సమాజ శ్రేయస్సులో వారిని భాగస్వాములుగా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది..
సీనియర్ జర్నలిస్ట్,
సెల్ 9032042014




