దక్షిణాది రంది
దేశ రాజకీయాల్లో మరోసారి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే, జరిగితే ప్రస్తుతం ఉన్న 543 లోకసభ స్థానాలు 816 వరకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రాల పరిధిలో అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. 2029 ఎన్నికల నాటికి కొత్త స్థానాలతోనే వెళ్లాలని కేంద్రం యోచిస్తున్నట్లు తాజాగా పరిణామాలను చూస్తే స్పష్టమవుతుంది.
మరోవైపు, డీ లిమిటేషన్ పెద్ద రాజకీయ వైరు ధ్యం కూడా గోచరిస్తున్నది. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే భారీగా లబ్ధి చేకూరుతుందని, దక్షిణాది రాష్ట్రా లు నష్టపోతాయనే చర్చ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. దశాబ్దాల కాలం నుంచి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ అమలు చేశాయని, జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే అవి నష్టపోతాయని, తద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందనే చర్చ నడుస్తున్నది.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల కలిగే పరిణామాలు కేవలం సీట్ల పెంపునకే పరిమితం కావు. లోకసభలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే దేశానికి అందే నిధుల పంపిణీలో కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్ట పోయే అవకాశం ఉంటుంది. ఆటజకీయంగా, ఆర్థికంగా దక్షిణా రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గళం విప్పారు.
నియోజకవర్గాల విభజన ప్రక్రియ వల్ల జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాముఖ్యత తగ్గుతుందని, తద్వారా దక్షిణాది పాత్ర నామమాత్రం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు. దక్షిణాది ప్రాతినిధ్యం దెబ్బతినకుండా, పునర్విభజన ఉండాలని కోరుతున్నారు. కనీసం మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రాల సీట్ల వాటాలో మార్పులు చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.
అంతేకా దు.. దీనిపై మరో అడుగు ముందుకు వేసి, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల అమలుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని, అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం 2029 వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, త్వరితగతిన నియోజకవర్గాల విభజన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సమాఖ్య వ్యవస్థలో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. సమస్యకు పరిష్కారం లభించాలంటే రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్ల అమలుకు నియోజకవర్గాల విభజన అవసరమే అయినప్పటికీ, అది రాష్ట్రాల మధ్య ఐక్యతను దెబ్బతీయకూడదు.
అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే, బిల్లును తీసుకురావడం ఉత్తమమనేది నిపుణుల అభిప్రాయం. దక్షిణాది ఆవేదన, అభ్యంతరాలను గుర్తించకుండా ముందుకు వెళ్తే, అది దేశ సమగ్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సున్నితమైన అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంది.




