calender_icon.png 12 November, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన..

12-11-2025 06:22:02 PM

మానవపాడు తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..

జిల్లా కలెక్టర్ సంతోష్..

అలంపూర్: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బి. ఎం. సంతోష్ బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న గింజలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నకు  క్వింటాలుకు రూ.2400 చెల్లించడం జరుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేశాక రైతులకు డబ్బులు వెంటనే చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు  చేసినట్లు తెలిపారు. ఈ పర్యటనలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, ఏఈఓ రాజమోహన్, తదితరులు పాల్గొన్నారు. 

మానవపాడు తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ...

భూభారతి, సాదాబైనామ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మానవపాడు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు దస్త్రాలను పరిశీలించారు. మండలంలో 508 సాదాబైనామ, 60 భూభారతి దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. కార్యాలయంలో మిగిలిన కార్యకలాపాలు సజావుగా చేస్తుండడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తహసిల్దార్ జోషి శ్రీనివాస శర్మ, ఉప తహసిల్దార్ కరుణాకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.