ఆ గ్రామాల్లో అంతా.. ఆర్టిజన్ బాబీ ఇష్టమే
ఎస్టిమేషన్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
విద్యుత్ శాఖలో రూ.3.50 లక్షల మామూళ్ల ఆరోపణలు
కాశిరెడ్డిపల్లిలో విద్యుత్ శాఖ ఉద్యోగి, మధ్యవర్తిపై తీవ్ర ఆరోపణలు
ఆలస్యంగా వెలుగులోకి..
గజ్వేల్, జులై 6: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో అంచనా నివేదికలు(ఎస్టిమేషన్), అధికారిక అనుమ తులు లేకుండానే పనులు చేపట్టి రైతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు మర్కుక్ మండలం కాశి రెడ్డిపల్లి గ్రామంలో కలకలం రేపుతున్నాయి.
గ్రామ సమీపంలో గున్నారం రాణి తన వ్యవసాయ భూమిలో త్రీఫేస్ ట్రా న్స్ఫార్మర్ ఏర్పాటు కోసం స్థానిక మధ్యవర్తి, విద్యుత్ శాఖ ఉ ద్యోగి కలిసి రూ.3.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం, ట్రాన్స్ఫార్మర్ కోసం రాణి వద్ద ఉద్యోగిగా పని చేస్తున్న సింగం నీలకంఠం స్థానిక కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సింగం వెంకటేష్ను సంప్రదించగా, ఆయన విద్యుత్ శాఖ ఆర్టిజన్ బాబీతో కలిసి రూ.3.50 లక్షలు డి మాండ్ చేశారని తెలిపారు. గత్యంతరం లేక వెంకటేష్, బాబీలకు రూ. 3.50 లక్షలు నగదు చెల్లించినట్లు వెల్లడించారు.
మూడు డీడీల చొప్పున మొత్తం రూ. 21వేలు చెల్లించామని, కానీ గున్నారం రాణి పేరున రెండు డీడీలు, సింగం వెంకటేశం పేరున ఒక డిడి తీసినట్లు నీలకంఠం చెప్పారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ముందుగా అంచనా నివేదిక (ఎస్టిమేట్), సంబంధిత అనుమతులు, డీడీ చెల్లింపులు తదితర ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో అలాంటి ప్రక్రియలు పూర్తికాకుండానే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అధికారికంగా ఈ పనికి సుమారు రూ. 30వేల నుండి రూ.50వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉండగా, లక్షల్లో వసూలు చేసినట్లు చెబుతున్నారు. కాశిరెడ్డిపల్లిలో బాబీ గతంలో కూడా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో రైతులను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతులు ఏడు డీడీలు చెల్లించగా వాటిని రద్దు చేయించాడని, గ్రామస్తులు ఓ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగి బాబీని బంధించారు. ఆ తర్వాత రైతులతో మళ్ళీ డీడీలు కట్టించి ట్రాన్స్ఫార్మర్ బిగించారు.
గతంలో ఆయనపై విజిలెన్స్ విచారణ కూడా జరుగగా, ఓ రెస్టారెంట్లో అధికారులతో చర్చలు జరపడంతో విచారణ కూడా తూతూ మంత్రంగా ముగిసిందని గ్రామస్థులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, గున్నారం రాణి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు ఎలాంటి అంచనా నివేదికలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ మామూళ్లు తీసుకుని పని పూర్తి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, విద్యుత్ శాఖ అధికారులు మాత్రం అన్ని నిబంధనలు పాటించినట్లు చెబుతున్నారు. రైతుల వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది, మధ్య దళారుల తీరుపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.






