7 July, 2026 | 2:22 AM

హైవేపై బ్రిడ్జి నిర్మించాలని ధర్నా

07-07-2026 12:00 AM

సదాశివపేట జాతీయ రహదారిపై ఉద్రిక్తత

గంటల తరబడి నిలిచిన ట్రాఫిక్ 

సదాశివపేట, జూలై 6: నిత్యం ప్రమాదాలకు హేతువుగా మారిన జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆరు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధర్నాతో సదాశివ పేట జాతీయ రహదారి 65 బైపాస్ జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బైపాస్ రోడ్డు దాటే క్రమంలో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి తక్షణమే అండర్పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చే స్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.

గ్రామస్థుల అకస్మాత్తు రాస్తారోకోతో హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిపై ఇరువైపులా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సదాశివపేట బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ జంక్షన్ ఒక ’బ్లా క్ స్పాట్ గా మారిందన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు అత్యంత వేగంగా దూసుకురావడం వల్ల రోడ్డు దాటే క్రమంలో ఎంతోమంది చనిపోయారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని హామీ ఇవ్వడంతో శాంతించారు.