30-01-2026 12:00:00 AM
- రెండేళ్లుగా స్టోర్ రూమ్‌లోనే చిత్ర పటాలు
- జాతీయ నేతల చిత్రపటాలకు అవమానం..!
చిగురుమామిడి, జనవరి 29: మహనీయులారా.. మన్నించండయ్యా.. అనేలా పరిస్థితి మారింది.. గత రెండేళ్లుగా గ్రామపంచాయతీ స్టోర్ రూమ్ లో నే మహనీయుల చిత్ర పటాలు మూలుగుతున్నాయి. చిగురుమామిడి మండలం గునుకులపల్లె నూతన గ్రామపంచాయతీ ప్రారంభం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా లక్ష్మీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 30 మహనీయుల చిత్ర పటాలను చైర్మెన్ గాదె రఘునాథ్ రెడ్డి గ్రామపంచాయతీకి అందజేశారు. అయితే రెండేళ్లుగా ఆ చిత్రపటాలను గ్రామ పంచాయతీ గోడలపై అమర్చకుండా నాటి నుంచి నేటి వరకు స్టోర్ రూమ్లోనే నిర్లక్ష్యంగా ఓ మూలన ఉంచడం గమనార్హం. ఇది మహనీయులను అవమానపరచడమే అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగర వేసే సమయంలో కూడా మహనీయుల చిత్రపటాలను బయటకు తీయక పోవడం కొసమెరుపు.. ఇదిలా ఉండగా.. మహనీయుల చిత్రపటాలను మంత్రిచే అందించిన లక్ష్మీ చారిటబుల్ ట్రస్టు చైర్మెన్ గాదె రఘు నాథ్ రెడ్డి ఆధ్వర్యంలోగతము లో కుర్చీలు, టేబుల్తో కూడిన ఫర్నీచర్ను సైతం పంపిణీ చేయగా, వాటిని మాత్రం ఉపయోగిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతీయ నాయకుల చిత్రపటాలను విస్మరించడంపై గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా.. లేదా పనిగట్టుకొని కావాలనే చేస్తున్నారా.. అనే అనుమానాలను ట్రస్టు ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మహనీయులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.