22 August, 2026 | 1:46 AM

అంతర్‌రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్

22-08-2026 12:00 AM

నేషనల్ ఫెర్టిలైజర్స్ ఫ్రాంచైజీ ఇప్పిస్తామని లక్షల్లో మోసం

నిందితులపై దేశవ్యాప్తంగా 498 సైబర్ ఫిర్యాదులు

ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తూ బీహార్ రాష్ట్రంలో తలదాచుకుంటూ, అతి సామాన్యులుగా జీవిస్తూ సైబర్ నేరాలకు పాల్పడు తూ కోట్లల్లో మోసాలు చేసిన ఐదుగురు నిం దితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఏఆర్ హెడ్క్వార్టర్స్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోరాజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన అ కునూరు గణేష్కు నేషనల్ ఫర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఆధార్, పాన్ కార్డు, ఫొటో తదితర వ్యక్తిగత వివరాలను సేకరించి, మొదట రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ. 50 వేలు చెల్లించుకున్నారు.

అనంతరం లైసెన్స్, ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్, అదనపు ఛార్జీలు తదితర కారణాలు చూపుతూ పలుమార్లు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసి, మొత్తం రూ. 3,85,725 వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ, నెప్ట్ మార్గాల ద్వారా బదిలీ చేయించుకున్నారు. అనంతరం నిందితులు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలకు స్పందించకుండా మోసం చేయడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. 

నిందితులపై దేశవ్యాప్తంగా 498 సైబర్ ఫిర్యాదులు...

ఒక నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ ఇచ్చే వెబ్ సైట్ ను ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా అప్లికేషన్ ద్వారా బాధితుల వివరాలను, వారి ఆధార్ పాన్, కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి విడతలవారీగా బాధితుల వద్ద వివిధ రకాల ఫీజులు సర్వీస్ ఫీజు, లైసెన్సు ఫీజు, ట్రేడ్ ట్రాన్స్ ఫర్ ఫీజు అంటూ లక్షల్లో వసూలు చేసి మోసం చేస్తున్నట్టు ఎస్పీ వెల్లడించారు.

అదేవిధంగా బజాజ్ లోన్ అంటూ నిందితులు, లోన్ కోసం ఆన్ లైన్ లో వెతికే బాధితుల వద్ద నుంచి అప్లికేషన్ ద్వారా వారి వివరాలను సేకరించి ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తూ లక్షల్లో వసూలు చేస్తూ, వందల మంది బాధితులను మోసం చేశారన్నారు. ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 498 నేరాలకు పాల్పడినట్లు, దాదాపు రూ. 3.5 కోట్ల వరకు ప్రజల వద్ద మోసం చేసి డబ్బులను కాజేసినట్లు తెలిపారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 90 సైబర్ క్రైమ్ నేరాలలో ఫిర్యాదులు అందాయన్నారు. 

నింధితులందరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లే... 

నింధితులందరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లేనని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సైబర్ నేరాలపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి బీహార్ రాష్ట్రానికి చెందిన అబిషేక్ కుమార్ @ సౌరవ్, ఆశుతోష్ కుమార్ @ బబ్లూ, నిషు కుమార్, రితేష్ కుమార్, అభినాష్ కుమార్ లను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

బాధితుల వద్ద నుంచి మోసం చేసి వసూలు చేసిన డబ్బులలో రూ. 8 లక్షలను బ్యాంకు ఖాతాలలో, స్టాక్ మార్కెట్ షేర్లలో ఇన్వెస్ట్ చేయగా జప్తు చేశామన్నారు. ఆన్లైన్లో కనిపించే ఫ్రాంచైజీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు, లైసెన్సులు తదితర ప్రకటనలను పూర్తిగా ధృవీకరించకుండా ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని ప్రజలకు సూచించారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను గుర్తించి అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 

ఈ విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి శ్రావణ్, ఎస్త్స్రలు పీర్ సింగ్, గౌతం, గోపికృష్ణ, సిబ్బంది త్రిశూల్, రాజేష్, పురుషోత్తం, రవీందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.