గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
* దుస్తులు ఉతికే వాషింగ్ లిక్విడ్ తాగిన విద్యార్థిని
* అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడ
* వరుస ఘటనలతో గురుకులాల నిర్వహణపై ప్రశ్నలు
అచ్చంపేట: గురుకుల విద్యాలయాల్లో వరుస ఇబ్బందికర సంఘటనలు చోటుచేసుకుంటున్న వాటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న విషయంలో అలసత్వం వీడటం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని టీజీఎస్‌ఆర్‌ఈఎస్ జూనియర్ బాలికల గురుకుల కళాశాలలో సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
పదర మండలానికి చెందిన విద్యార్థిని కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సదరు విద్యార్థిని దుస్తులు శుభ్రం చేసేందుకు వినియోగించే వాషింగ్ లిక్విడ్ (కంపోర్ట్) తాగినట్లు సమాచారం. ఇది గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే హౌస్‌మాస్టర్ మాలికకు సమాచారం అందించడంతో ఏఎన్ఎం దివ్యతో కలిసి ఆమెను అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డ్యూటీ డాక్టర్ దేవేందర్ తెలిపారు.
* బాధ్యత ఎవరిది..?
విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా? లేక కళాశాలకు సంబంధించిన ఇబ్బందులా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు విద్యార్థిని స్పందించేందుకు నిరాకరించింది. ఇటీవల మన్ననూరులోని (పిటిజి) గురుకుల విద్యాలయంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. వరుసగా ఇబ్బందికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, తాజాగా ఆత్మహత్యాయత్నం చోటుచేసుకోవడం నిర్వహణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనను బయటకు రానీయకుండా ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వరుస సంఘటనల నేపథ్యంలో గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, పర్యవేక్షణ వ్యవస్థలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






