4 August, 2026 | 10:40 AM

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

04-08-2026 09:40 AM

 – పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని ఇరక్ పల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ముల్తాన్ తన భార్య ఇర్ఫాన (32)ను ఇంటి నుంచి మౌలాలి దర్గా ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం దర్గా ప్రాంతంలో లభ్యమైంది. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిపి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

హత్య అనంతరం ఉదయం సుమారు 5 గంటలకు నిందితుడు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తానే తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, నాగల్‌గిద్ద ఏఎస్ఐ రవీందర్ తదితర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.