అంతర్జాతీయ మహిళా దినాన్ని జయప్రదం చేయాలి
ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మేకల రాజేశ్వరి
గరిడేపల్లి, మార్చి 3 : ఈనెల 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మేకల రాజేశ్వరి అన్నారు. మండలంలోని వెలిదండ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినం పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా పోరాటాలను, అందించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మరింత ముందుకు సాగాలన్నారు.
మన దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వివిధ రకాల వివక్షతలకు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పనిలో భాగంగా పేరు మార్చి, కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించి రాష్ట్రాలపై భారం వేసి పథకం నుండి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు.
ఈ అంశం పైన అంతర్జాతీయ మహిళా దినం సాక్షిగా, గ్రామీణ మహిళా లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగమ్మ, సువార్త, గండు నాగేంద్ర, మల్లమ్మ, కళ్యాణి, సంధ్య, పద్మ,స్వరాజ్యం, నరసమ్మ, లక్ష్మి,శ్రవంతి, త్రివేణి,, రేణుక తదితరులు పాల్గొన్నారు.




