calender_icon.png 8 January, 2026 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అదుపులో పరారైన అంతర్రాష్ట్ర దొంగ

07-01-2026 12:41:01 PM

సుమారు రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న  నాగిరెడ్డి

కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసులకు ఊరట లభించింది. గత సంవత్సరం నవంబర్ 13న విచారణ సమయంలో పోలీసుల కళ్లుకప్పి పరారైన అంతర్రాష్ట్ర దొంగ తెలుగు నాగిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడుతూ వివిధ రాష్ట్రాల్లో తిరిగే తెలుగు నాగిరెడ్డిని విచారణ నిమిత్తం కల్వకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో మలవిసర్జనకు వెళ్తున్నా అని చెప్పి మరుగుదొడ్డి నుండి గోడ దూకి పరారయ్యాడు. ఆ ఘటన అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది.

దాదాపు రెండు నెలలుగా పోలీసులకు ముప్పుగా మారిన  దొంగను మల్కాజ్గిరి సిసిఎస్ సీఐ జలంధర్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రాంతంలో, తన ప్రియురాలితో కలిసి ఉంటున్న సమయంలో పట్టుకున్నారు. అనంతరం అతడిని కల్వకుర్తి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న దొంగను పట్టుకోవడంతో కల్వకుర్తి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతనిపై కల్వకుర్తిలో ఆరు కేసులు ఉన్నట్లు సమాచారం. ఘటనలో నిందితుడు పరారీ కి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ఉన్నతాధికారులు సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు సైతం తీసుకున్నారు  .