10-05-2025 12:10:37 AM
సింగరేణి సీఎండీ, రెవెన్యూ మంత్రి వద్దకు ఐఎన్టీయూసీ నేతలు
మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి, సింగరేణి సీఎండీ వద్దకు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ బీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో బృంద సభ్యులు కలిసి విన్నవించుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో సీఎండీ బలరాం నాయక్ ని, క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్య నాయకుల బృందం కలిసి సమస్యలు వివరించారు.
కార్మికుల సమస్యల కోసం సింగరేణి సీఎండీని...
సింగరేణి కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎండీ బలరాం నాయక్ కు జనక్ ప్రసాద్ అధ్యక్షతన ఐఎన్టీయూసీ నాయకుల బృందం విన్నవించింది. ముఖ్యంగా పెర్క్స్ పైన ఉన్న ఆదాయపన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) మాఫీ, సొంత ఇంటి పథకం అమలు, కార్పొరేట్ మెడికల్ బోర్డ్ మార్పు, మెడికల్ అటెండెన్స్ నిబంధనల్లో సవరణ, డిస్మిస్ అయిన కార్మికుల సమస్య పరిష్కారం, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, సింగరేణిలో ఐటీ కంపెనీ స్థాపన, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 3,700 కంటే ఎక్కువ ఉద్యోగ సంబంధిత కేసుల పరిష్కారానికి ఒకే విడతలో లోక్ అదాలత్ నిర్వహించాలన్న విన్నవించారు.
సొంతింటి కోసం రెవెన్యూ శాఖ మంత్రి వద్దకు...
సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సొంతింటి కోసం రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా బృందం మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించింది. సింగరేణి కార్మికుల కోసం సొంత ఇంటి పథకం త్వరితగతిన అమలు చేయాలనే విజ్ఞప్తి చేయడంతో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ బీ జనక్ ప్రసాద్ వెల్లడించారు. మంత్రిని, సీఎండీని కలిసిన బృందంలో జనక్ ప్రసాద్ తో పాటు ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహా రెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, కాంపల్లి సమ్మయ్య, జెట్టి శంకర్ రావు, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, రాజేందర్, అక్రమ్, వైస్ ప్రెసిడెంట్ కలవెన శ్యామ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, మహిళా అధ్యక్షురాలు శేషా రత్నం, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు దాస్, ఏరియా వైస్ ప్రెసిడెంట్లు సదానందం, రవీందర్ రెడ్డి, పీతాంబరం, రజాక్, మధుకర్ రెడ్డి, పేరం శ్రీనివాస్, దేవి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.