పెద్ద చెరువుతో శ్రీవాణినగర్‌కు ముంపు
ఎఫ్‌టీఎల్ పెంపుతో కాలనీకి ప్రమాదం
జేఏసీగా పోరాడుతున్న స్థానికులు
సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి
పటాన్‌చెరు, జూన్ 7: (విజయక్రాంతి) : పెరుగుట విరుగుటకే అన్నట్టు.. అమీన్‌పూర్ ఏరియా పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పెంపుతో శ్రీవాణినగర్ కాలనీ ముంపునకు గురవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఐదు సంవత్సరాలుగా కాలనీ వాసులు ముంపు సమస్యతో సతమతమవుతున్నారు. వర్షాకాలంలో కాలనీ మొత్తం చెరువును తలపిస్తుందని ఆవేదన చెందుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు, మియాపూర్ నుంచి రసాయన వ్యర్థాలతో చెరువు ఇప్పటికే దుర్గంధ భరితంగా మారిందని, ఇక వానకాలంలో ఆ వరద నీరంతా కాలనీలకు చేరి మరింత అధ్వానంగా తయారవుతోందని వాపోతున్నారు.
తమ సమస్యను పరిష్కరించాలని ఐదేళ్లుగా కాలనీవాసులు పోరాడుతూనే ఉన్నారు. స్థానికులంతా జేఏసీగా ఏర్పడి.. అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ బాధను విన్నవిస్తూనే ఉన్నారు. ఏడేళ్ల క్రితం ఈ చెరువు కళకళలాడేదని, వలస పక్షులకు కూడా చెరువు నెలవుగా ఉండేదని పేర్కొంటున్నారు. కాలక్రమేణా మురుగు నీరు, రసాయన వ్యర్థాల స్టోరేజీగా మారి జనజీవనానికి ప్రమాదకరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఎఫ్‌టీఎల్ పెంపు వల్ల కాలనీల్లోకే వరద నీరు చేరుకుని మరింత అస్తవ్యస్తంగా మారిందని వాపోతున్నారు.
అలుగు, తూము మూసి వేయడమే సమస్య..
సర్వేనంబర్ 231లో ఉన్న పెద్ద చెరువు 93.15 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. రెండు అలుగులు, రెండు తూము ఉండేవి. ఐదు సంవత్సరాల క్రితం వరకు చెరువు నిండితే అలుగు ద్వారా నీటిని వదిలేవారు. అక్కడక్కడా పంటలు వేసుకునే వారికి తూము కాలువ ద్వారా నీటిని అందించే వీలుండేది. అయితే, చెరువు చుట్టూ ఇప్పుడు కాలనీలు వెలిశాయి. అలుగు, తూము మూసివేతకు గురయ్యాయి. చెరువులోకి నీరు రావడమే బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఫలితంగా చెరువులో నీటిమట్టం నానాటికి పెరగడం తోపాటు వర్షకాలం వరద మరింత పెరిగి సమీప కాలనీ శ్రీవాణినగర్‌ను ముంచెత్తుతోంది.
కాలనీ కోసం జేఏసీ ఏర్పాటు
తమ కాలనీ రక్షణ కోసం శ్రీవాణినగర్ వాసులు జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను కలిసి సమస్యను విన్నవిస్తూ వస్తున్నారు. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం, మళ్లీ వర్షకాలం సమీపించడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కలెక్టర్ క్రాంతి వల్లూరి అమీన్ పూర్ పెద్ద చెరువును మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అలుగు, తూము కాలువలను పునరుద్దరించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు ఆచరణకు నోచుకోకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు సంవత్సరాలుగా అవస్థలు
పెద్ద చెరువు సమస్య పరిష్కారానికి దాదాపు ఐదు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. అధికారులు ఎవ్వరు పట్టించుకో వడం లేదు. వర్షాకాలంలో కాలనీ నీట మునగడం ప్రతిసారి జరుగుతుంది. దీనికి పరిష్కారం మాత్రం లభించడంలేదు. అలుగు, తూము కాలువల ద్వారా నీటిని వదిలితేనే మా కాలనీ బాగుంటుంది. లేదంటే గత ఏడాది జరిగిందే ఈ సారి జరుగుతుంది.
బ్రహ్మానందరావు, జేఏసీ వైస్ చైర్మన్
ఐదు వేల ప్లాట్లకు ముప్పు
శ్రీవాణీనగర్ కాలనీతో పాటు ఇరవై లే అవుట్‌లలో ఉన్న ఐదువేల ప్లాట్లు నీట మునుగుతున్నాయి. ప్రతి సారి అధికారులను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్య పరిష్కారానికి ముంపు బాధితులందరం కలిసి జేఏసీగా ఏర్పడ్డాము. అలుగులు, తూము కాలువల ద్వారా కిందికి వదిలితే సమస్య పరిష్కారం అవుతుంది.
వెంకటప్పయ్య, జేఏసీ జనరల్ సెక్రటరీ
మా కాలనీని కాపాడాలి
శ్రీవాణీనగర్ నీట మునగడానికి ప్రధాన కారణం పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పెరగడం. అలుగులు, తూము కాలువలను మూసేయడమే. ఈ విషయమై మంత్రి శ్రీధర్‌బాబును కలిసి విన్నవించాం. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. నాలుగు రోజుల క్రితం కలెక్టర్ వల్లూరి క్రాంతి వచ్చి పెద్ద చెరువును చూశారు. అలుగులు, తూము కాలువలను పునరుద్దరించాలని ఆదేశించారు. అలుగు, తూము కాలువలను బాగు చేసి నీటిని కిందికి వదిలితే కాలనీలు నీట మునగవు.
చిరునామా సత్యనారాయణ, పెద్ద చెరువు బాధితుల జేఏసీ చైర్మన్






