calender_icon.png 13 September, 2024 | 1:42 AM

ఫార్మాలో పెట్టుబడులు

08-08-2024 12:58:44 AM

  • రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్‌ల తయారీ
  • వచ్చే ఏడాది నుంచి ఉత్పత్త ప్రారంభం
  • కార్నింగ్ కంపెనీతో సీఎం బృందం ఒప్పందం
  • 400 కోట్లతో వివింట్ ఫార్మా విస్తరణ

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): అంతర్జాతీయంగా పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతోపా టు పరిశ్రమలో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదు ర్చుకుంది.

అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్లీరన్ ఆధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధికారికంగా అవగాహన ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో భాగస్వామ్యమవుతుంది. 

వచ్చే ఏడాది ప్రారంభం

ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం 2025 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం, హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో టెక్నాలజీ హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామి అవుతుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమల్లో ఆవిష్కరణలతోపాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలో ఈ కంపెనీ సహకారం అందిస్తుంది.

కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న అడ్వాన్డ్స్ ఫ్లో రియాక్టర్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపె నీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమల్లో ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందనే అంచనాలున్నాయి. 

వివింట్ ఫార్మా విస్తరణ

ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీవోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రం ఉంది. సుమారు రూ.70 కోట్లతో నెలకొల్పిన ఈ కేంద్రంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.

అందులో భాగంగా హైదరాబాద్‌లోనే తన మొదటి తయారీ కర్మా గారాన్ని స్థాపించనుంది. పరిశోధన, ఆవిష్కరణ కేంద్రంతోపాటు తయారీ యూనిట్, మౌలిక సదుపాయాల కల్పనకు జీనోమ్ వ్యాలీలో 5.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ప్రధానంగా అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల్లో అత్యంత నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీకి అధునాతన తయారీ సామర్థ్యాలతోపాటు దేశంలోని నిపుణులకు ఉపాధినిచ్చేలా ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. 

ఆవిష్కరణల ప్రోత్సాహానికి సిద్ధం

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటం సంతోషంగా ఉంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది.

 సీఎం రేవంత్‌రెడ్డి

వివింట్ ఫార్మాతో లైఫ్ సైన్సెస్ వృద్ధి 

తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంది. జీనోమ్ వ్యాలీ ఔషధ కంపెనీలను తప్పకుండా ఆకర్శిస్తుంది. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలతో కొత్త కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. వివింట్ ఫార్మా కొత్త తయారీ కేంద్రం ఏర్పాట్లు తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్దికి దోహదపడుతుంది.

 శ్రీధర్‌బాబు, 

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి