- అద్దె భవనాల్లో బీసీ గురుకులాలు
- తరగతి గదులే డైనింగ్ హాళ్లు
- చదువుకునేందుకు విద్యార్థుల అపసోపాలు
- నిర్మల్ బీసీ గురుకుల బాలికల క‘న్నీటి’ గాథ
నిర్మల్, ఆగస్టు ౭ (విజయక్రాంతి): బీసీ గురుకుల పాఠశాలల్లో చదువుకునేందుకు విద్యార్థులు అరిగోస పడుతున్నారు. ఎక్కడా సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య చదువులను కొనసాగిస్తున్నారు. తరగతి గదులు సరిపోక అపసోపాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం సారంగాపూర్‌లోని బీసీ బాలికల గురుకుల పాఠ శాలలో భవనం సెల్లార్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీలో సెల్లార్‌లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్‌లోకి వర్షం నీరు ప్రవేశించి, ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. .
మంజూరు జరిగింది సారంగాపూర్‌కు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను ౨౦౧౭ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం మంజూరుచేసింది. అయితే అక్కడ పాఠశాల నిర్వహణకు తగిన భవనం, మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో దానిని నిర్మల్ జిల్లాకేంద్రానికి తరలించి ఇక్కడే నిర్వహిస్తున్నారు.
నిరుడు షార్ట్ సర్క్యూట్
ఈ పాఠశాలలో ౬౮౦ మంది విద్యార్థినులు చదువుకొంటున్నారు. అసలే ఇరుకైన గదులు, ఆపై సెల్లార్‌లో పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు రావడంతో బాలికలు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. గురుకుల పాఠశాల సమస్యలు తీర్చాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు గతంలో ఎన్నోసార్లు అప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు.
అంతమందికి నీటిని సరఫరా చేసేందుకు ఒకటే బోరు ఉండటంతో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో తరగతి గదుల్లోనే అన్నం తినాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ గురుకులంలో విద్యాబోధన చేసేందుకు మొత్తం 30 మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా ప్రస్తుతం 20 మంది రెగ్యులర్ ఉపాధ్యాయు లు, ౧౦ మంది కాంటాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం ఏడుగు రు రెగ్యులర్ ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నియామకాల్లో మరో 13 మంది కొత్త ఉపాధ్యా యులు విధుల్లో చేరారు. దీంతో ఉపాధ్యాయుల సమస్య కొంత మేరకు పరిష్కారం అయ్యింది.
చదువంటే భయమేస్తోంది
మా గురుకుల పాఠశాల ఏర్పాటైనప్పటి నుంచి అద్దె భవనంలోనే ఉంది. ఇరుకు గదుల్లోనే చదువుకుంటున్నాం. కిటికీలు లేక చీకటిలోనే పాఠాలు చెప్తున్నారు. సెల్లార్‌లో తాత్కాలిక తరగతి గదులు నిర్మించారు. చిన్న వర్షం పడినా నీళ్లు గదుల్లోకి వచ్చి కూర్చోవడానికి వీలులేకుండా మారుతున్నది. మాకు భయంగా ఉంది. నీరు నిలుస్తుండటంతో మా బ్యాగులు, పెట్టెలు
కిచెన్ గదిలోకి మార్చారు. డైనింగ్ హాలు లేక క్లాసు రూంలోనే తింటున్నాం.
సంధ్యారాణి, 10 తరగతి, బాలికల గురుకుల పాఠశాల నిర్మల్
ఆటస్థలం లేక బయటికి తీసుకెళ్తున్నాం
ఎన్నో ఆశలతో పీడి ఉద్యోగంలో చేరిన. పాఠశాలలో ఆట స్థలం లేక విద్యార్థులకు సరైన క్రీడాశిక్షణ ఇవ్వలేకపోతున్నాం. ఆటలు, వ్యాయామం, వాకింగ్, యోగా వంటివి నేర్పించాలనుకుంటే పిల్లలను ప్రతి రోజు వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నాం. రోడ్డుపై వెళ్లేటపుడు, వచ్చేటపుడు వాహనాల రద్దీ కారణంగా ఇబ్బందికరంగా ఉంది.
ప్రవళిక, పీడీ, నిర్మల్ బాలికల గురుకుల పాఠశాల
ప్రభుత్వానికి నివేదిస్తున్నాం
గురుకులంలో సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం. జిల్లాలో ఎనిమిది గురుకుల పాఠశా లు అద్దె భవనా ల్లో నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నవి. అద్దె భవనాల్లో ఇరుకు గదులు, మౌలిక సదుపాయాలు లేని మాట వాస్తవమే. ప్రభుత్వానికి, పై అధికారుల దృష్టికి ఈ విషయాలను ఎన్నో సార్లు తీసుకెళ్లి నం. ప్రభుత్వం స్వంత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు.
సంతోష్, డీసీవో, నిర్మల్