రూ.4 కోట్లు అడవి కాసిన వెన్నెలేనా?
ప్రారంభానికి నోచుకోని సిరిసిల్ల అర్బన్ పార్క్
200 ఎకరాల్లో అడవిని తలపించేలా నిర్మాణాలు
అధికారుల అలసత్వంతో ప్రజలకు దూరం
రాజన్న సిరిసిల్ల, జూన్ 1౩ (విజయక్రాంతి): నాలుగేళ్ల కిందట పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మించారు. 200 ఎకరాల్లో నందనవనం లాంటి ఉద్యానవనం తయారుచేసి ప్రారంభించకుండానే వదిలేశారు. సిరిసిల్ల పట్టణానికి 10కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పదిర అటవీ భూమిలో పార్కు ఏర్పాటుకు అప్పటి మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2020 జూన్ 26న శంకుస్థాపన చేశారు. అటవీశాఖ పనులు చేపట్టింది. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండగా ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ఓపెనింగ్ కాస్త పెండింగ్‌లో పడింది. ఇక దాని వైపు చూసే వారే కరువయ్యారు.
200 ఎకరాల్లో రూ.4.40కోట్లతో పార్కు నిర్మాణం
ప్రకృతి అందాలను ఆసాదించడానికి పట్టణ ప్రజలు దూర తీరాలకు ప్రయాణం చేస్తుంటారు. గత ప్రభుతం నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే దిశగా పార్కుల ఏర్పాటును చేపట్టింది. సిరిసిల్ల మున్సిపల్ నగర వాసులకోసం అర్బన్ పార్కుకు శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోనే సిరిసిల్ల అర్బన్ పార్కు నిర్మాణం పూర్తి చేశారు. కొద్ది రోజులు స్థానికులను అందులోకి అనుమతించారు. అప్పట్లో సిరిసిల్ల అర్బన్ పార్క్ ఫోటోలు వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. అప్పటి ప్రభుత్వం కూడా బాగానే ప్రచారం నిర్వహించింది.
కాళేశరం ప్రాజెక్ట్ కంపా నిధులు, హరితహారంలో భాగంగా సిరిసిల్ల ప్రజల కోసం అర్బన్ ఫారెస్ట్ పార్కును అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల్లోనే ప్రజలకు పార్కు అందుబాటులోకి వస్తుందని భావించినా దాదాపు నాలుగేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సిరిసిల్లకు మున్సిపల్‌కు 10 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల కామారెడ్డి రోడ్డులో పోతిరెడ్డిపల్లి ఆటవీ ప్రాంతంలో రూ. 3కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో అర్బన్ పార్కు పనులను చేపట్టారు. దీంతోపాటు రూ.1.40 కోట్లతో అదనంగా అక్సిజన్ పార్కు, చిల్డ్రన్ పార్కులు రూపకల్పనచేస్తూ నిధులు మంజూరు చేశారు.
ఆకట్టుకుంటున్న అడవిలో అందాలు
ఎల్లారెడ్డిపేట మండలం మండలంలోని పోతిరెడ్డిపల్లి సమీపంలో 581 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. 200 హెక్టార్ల లో దట్టమైన చిట్టడవిని పెంచుతూ 10 హెక్టార్లలో ప్రజలకు అవసరమైన వసతులను ఏర్పాటు చేశారు. 200 ఎకరాల్లో పికినిక్ స్పాట్‌తోపాటు పెద్ద వనాలు, బట్టర్‌ఫ్లు పార్కు, ఔషధ మొక్కలు వంటివాటితో విభిన్నమైన రీతిలో పార్కును రూపొందిస్తున్నారు. పార్కు లో గుట్ట కింది భాగాన సేద తీరేందుకు గజి బో, రోడ్డు నుంచి కిలోమీటరు దూరంలో పచ్చని చెట్ల మధ్యన యోగా కేంద్రాన్ని, ఇంటర్నల్ రోడ్లు నిర్మించారు. ప్రవేశ దారం, లోటస్‌పాండ్, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్, వివిధ ఆకృతుల్లో కూర్చొనే బెంచీలు, బాత్రూంలు, టాయ్‌లెట్లు, బటర్ ఫ్లు గార్డెన్, ఆల్ఫాబెట్ ఏరియాను పూర్తి చేశారు.
పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. అందులో వాటర్ ఫాల్స్, బోటు షికారు వంటివి ఏర్పాటు చేయనున్నారు. చిన్నారుల కోసం 10 హెక్టార్లలో చిల్డ్రన్స్ ప్లే ఏరియాను సిద్ధం చేస్తున్నారు. ఉయ్యాలలు, జారుడు బల్లలు, ఔట్‌డోర్ జిమ్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అడెంచర్ పార్కు, స్కల్ప్చర్ పార్క్, హెర్బల్ పార్కు, ట్రీహౌస్, ట్రెక్కింగ్‌పా త్, వాచ్‌టవర్, కార్తీకవనం, పిక్‌నిక్ ఏరియా, ఔట్‌డోర్ క్లాస్‌రూంలు నిర్మించనున్నారు. పర్కులేషన్ ట్యాంకులపై తీగల వంతెనలు, వాచ్ టవర్, ఆట మైదానాలు నిర్మించారు.






