రాష్ట్రంలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు
ఎన్‌హెచ్‌ఎంతో కలిసి ఆరోగ్య పరీక్షలు
జీవనశైలి వ్యాధుల గుర్తింపునకు ప్రాధాన్యం
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి) : ప్రజల జీవన శైలి కారణంగా రాష్ట్రంలో పెరుగుతున్న వ్యాధులకు చికిత్స అందించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. అందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 26 ఏళ్ల వయసున్న వారికి ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వాహనాలను వినియోగించి ఊరూరికి వెళ్లి ఈ ప్రత్యేక పరీక్షలు చేస్తారు. ఇందుకోసం 10 మొబైల్ వ్యాన్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరించనున్నాయి.
ఊరూరా ఆరోగ్య పరీక్షలు
దాదాపుగా గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో గుండె జబ్బులు, బీపీ, షుగర్, క్యాన్సర్, తదితర జీవన శైలికి సంబంధించిన రోగాలు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధ్యయనాల్లో తేలింది. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ కారణంగానే దాదాపు 60 శాతానికి పైగా వ్యాధులు వస్తున్నట్లు గుర్తించారు. ఇక ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్‌పై మహిళలకు కనీస అవగాహన లేదు. కేవలం ఒక్క శాతం మంది మహిళలు మాత్రమే రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకునవచ్చు. అమెరికా, యురోపియన్ దేశాల్లో మహిళలు నూటికి నూరు శాతం బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటారని అక్కడి ప్రజల్లో ఉన్న అవగాహనకు ఇది ఉదాహరణ అని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రజలకు వైద్య పరీక్షలపై అవగాహన కల్పించడం ద్వారా వారిని పరీక్షలు చేయించు కునేలా ప్రోత్సహించేందుకు సైతం అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుంచి ముందస్తు పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించి సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు పేదలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
స్థానికంగానే పరీక్షలు
ఊరూరా మొబైల్ వాహనాల ద్వారా తిరుగుతూ 26 ఏళ్ల వయసున్న వారందరికీ డిజిటల్ మామోగ్రామ్, ఈ2డీ ఎకో, పాప్‌స్మైర్, ఈసీజీ, ఇతర అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. అందుకోసం మొబైల్ వాహనంలోని ల్యాబ్‌లో వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్లు ఉంటారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము, నోటి క్యాన్సర్లు, గుండె జబ్బులు, బీపీ, షుగర్ పరీక్షలను చేస్తారు. పురుషుల్లోనూ నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల తర్వాత పాజిటివ్ లక్షణాలుంటే హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. బీపీ, షుగర్ వ్యాధులకు స్థానికంగానే ఉచితంగా మందులు అందిస్తారు. స్థానికంగా ఉండే సర్కారు దవాఖానల్లో నెలనెలా మందులు ఉచితంగా అందిస్తారు. ఇంటి నుంచి రాలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఆరోగ్య కార్యకర్తలు ఇంటి వద్దకే వచ్చి మందులు అందించి ఆరోగ్య సలహాలు సైతం ఇస్తారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి ఓ భరోసా లభించనుంది.






