07-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ/భూపాలపల్లి అక్టోబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ పార్టీ బాకీలు చేసి మళ్లీ వాళ్లే బాకీ కార్డులు పంచడం సిగ్గుచేటని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.సోమవారం ఆయన భూపాలపల్లి పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని రు.7 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల కుప్పగా మార్చిన డోకా ప్రభుత్వం బిఆర్‌ఎస్ అని ఎమ్మెల్యే మండిపడ్డారు.బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 24 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు.
రైతులు వరి వేస్తే ఉరి అని తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేసింది మీరు కాదా అని విమర్శించారు. 317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కాదా అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమై వారిని డోకా చేసింది మీరు కాదా అని అన్నారు.
గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని వారిని డోకా చేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు.ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కొందరు చూసి తట్టుకోలేని నాయకులు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ డోకా కార్డులను ఎమ్మెల్యే మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాజర్ల అశోక్, అప్పం కిషన్, తదితరులు పాల్గొన్నారు