14 August, 2026 | 1:06 AM

బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

14-08-2026 12:07 AM
  1. నివారణలో మత పెద్దల పాత్ర కీలకం 
  2. సమాచారం అందిస్తే తక్షణ చర్యలు 
  3. నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక  

నారాయణపేట, ఆగస్టు 13(విజయక్రాంతి):  నారాయణపేటను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక పిలుపునిచ్చారు. శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పూజారులు, పాస్టర్లు, ఖ్వాజీలకు బాల్య వివాహాల నిర్మూలనపై గురువారం వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహం ఒక సామాజిక రుగ్మత మాత్రమే కాకుండా చట్టవిరుద్ధమైన చర్య అని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండని బాలికకు వివాహం చేయడం వల్ల ఆమె విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. పూజారులు, మౌలానాలు, పాస్టర్లు, ఖాజీలు వివాహ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారని, సమాజంలో వారి మాటకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

బాల్య వివాహం నిర్వహించేందుకు ఎవరైనా సంప్రదించినప్పుడు, వివాహానికి అనుమతి ఇవ్వకుండా ఇది సరైన వయసు కాదు.. వివాహాన్ని వాయిదా వేయండి అని స్పష్టంగా చెప్పాలని కోరారు.తమ పరిధిలో బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని మత పెద్దలకు సూచించారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సర్పంచులు, చైల్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన,

శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన కల్పిస్తూ ముద్రించిన బ్రోచర్లను ఎస్పీతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్ గౌడ్, డీపీఆర్‌ఓ రషీద్, డీసీపీఓ కరిష్మా, చైల్డ్లైన్ తిరుపతయ్య, సీడీపీఓలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.