calender_icon.png 5 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ కుట్రే..

05-01-2026 01:25:50 AM

  1. ప్రణీత్‌రావు, శ్రవణ్‌కుమార్‌తో సంబంధాలు లేవు

ఆరోపణలు అవాస్తవం.. నిరూపించుకునేందుకు సిద్ధం

సిట్ విచారణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ పాత్రపై సిట్ పశ్నల వర్షం

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 4 (విజయక్రాంతి): ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న ప్రణీత్‌రావు, శ్రవ ణ్‌కుమార్‌తో నాకు ఎలాం టి సంబంధాలు లేవు.. వారి తో నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. కేవలం నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకే రాజకీయంగా ఇలాం టి అసత్య ప్రచారం చేస్తున్నారు.. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం.. నిరూపించుకునేందుకు నేను సిద్ధం’ అని సిట్ దర్యాప్తు అధికారుల విచారణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు స్పష్టం చేసినట్లు తెలిసింది. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడంతో ఆదివారం ఆయన జూబ్లీహిల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ, మరికొందరు బీఆర్‌ఎస్ స్నేహితులతో కలిసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై సిట్ అధికారులు ఆయన్ను ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. ట్యాపింగ్‌లో మీ పాత్ర ఏంటి..? 

ఎవరితో చేయి కలిపారు..? మీ వెనుక ఎవరున్నారు.. ఏయే డివైజ్లు వాడారు..? అంటూ సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వీటిపై నవీన్‌రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. విచారణ సందర్భంగా సిట్ అడిగిన పలు ప్రశ్నలకు నవీన్ రావు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు, ఆరోపణలను పూర్తిగా ఖండించినట్లు తెలుస్తోంది.   

విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రావు మీడియాతో మాట్లాడారు. విచారణకు నేను పూర్తిగా సహకరించానని తెలిపారు. గత విచారణలో అడిగిన విషయాలనే మళ్లీ అడిగారు తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు. నేను డివైస్లు ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ చేశానన్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. మళ్లీ విచారణకు రావాలని అధికారులు చెప్పలేదని, కానీ ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నా అని స్పష్టం చేశారు. 

నవీన్ రావు  మద్దతుగా వచ్చిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. ‘ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరి స్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కుట్ర తోనే విచారణల పేరుతో వేధిస్తున్నారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, కార్ రేసుల పేరుతో బీఆర్‌ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది’ అని ఆయన ఆరోపించారు.

సిట్ అడుగు ఎటువైపు?

నవీన్ రావు విచారణ ముగియడంతో సిట్ తదుపరి అడుగు ఎటువైపు పడనుందన్నదని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో విచారణ ను మరింత లోతుగా జరిపేందుకు సిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు కూడా త్వరలోనే సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఎమ్మెల్సీ స్థాయి నేతను విచారించడంతో, తదుపరి వంతు గులాబీ పార్టీ అగ్రనేతలదేనన్న వాదనలకు బలం చేకూరుతోంది. సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ బృందం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా నవీన్ రావు విచారణతో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని పలువురు నేతలు వణికిపోతున్నట్టు సమచారం.