calender_icon.png 7 January, 2026 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ టికెట్ల కోసం పైరవీలు

05-01-2026 05:57:59 PM

ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ! 

మున్సిపల్ ఎన్నికల కోలాహలం

ఆర్మూర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూరు కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, భీంగల్  మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోలాహాలం మొదలైంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ నెలా రెండవ వారం లేదా మూడవ వారంలో  నోటిఫికేషన్ విడుదలై ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరుగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలోని నాయకుల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషన్ మున్సిపల్ నోటిఫికేషన్ వెలువరించక ముందే మున్సిపల్ ఏరియాల్లో రాజకీయం వేడెక్కింది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ, బి.ఆర్.ఎస్.,  బీజేపీ పార్టీలు వార్డుల వారీగా పోటీ చేసే ఆశావాహుల వివరాలను సేకరించి సిద్ధం చేసుకుంటున్నాయి.

జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్,  ఆర్మూర్, భీంగల్  మున్సిపాలిటీలో గెలుపొందడమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీల నియోజకవర్గాలకు చెందిన ప్రధాన నాయకులు మున్సిపల్ పరిధిలోని చోటామోటా లీడర్లతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ నెల మూడవ వారంలో రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో కార్పొరేషన్, మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసే ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్లు పొందేందుకు నాయకులు తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, ప్రధాన నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అవసరమైతే ఈ దఫా ఎలాగైనా పోటీ చేయాలన్న దృఢ సంకల్పంతో మున్సిపల్ పరిధిలోని నాయకులందరూ ఇతర పార్టీలోకి మారైనా సరే టికెట్లు సాధించి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే విషయం జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిపోవడంతో మెజారిటీ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులే విజయం సాధించడంతో తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ముందుకు వెళుతున్నట్లు కనబడుతుంది.

మున్సిపల్ ఎన్నికలు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతుండడంతో  కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే కార్పొరేషన్ మున్సిపల్ లలో అధికారులు ఓటర్ల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఓటర్ల జాబితా పై అన్ని పార్టీల నాయకులు తప్పులు చాలా ఉన్నాయని ఓటర్ల జాబితాలో వెలువడ్డ తప్పులను సవరణ చేయాలని అధికారులకు విన్నపాలు సైతం అందజేస్తున్నారు. అధికారులు ఓటర్ల జాబితాను వచ్చిన ఫిర్యాదులపై సవరణ ప్రక్రియను శరవేగంగా చేస్తున్నారు త్వరలోనే తుది ఓటర్ల జాబితా ను అధికారులు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

తుది ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత వార్డుల వారీగా కార్పొరేషన్, మున్సిపాలిటీలో రిజర్వేషన్లు కూడా అధికారులు ఖరారు చేయనున్నారు. అధికారులు త్వరలోనే రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో మీ అనుకూలిస్తే కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేసే నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇదివరకు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా కొనసాగిన మాజీలు పోటీ చేసేందుకు పలు వార్డుల్లో ఉత్సాహం చూపుతుండగా, గతంలో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు సైతం ఈ సారి జరగబోయే ఎన్నికల్లో మరో మారు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఏ తీరుగానైనా పార్టీలు మారైనా సరే టికెట్లు సంపాదించుకొని పోటీ చేస్తే ప్రజల సానుభూతి తమకు అనుకూలంగా ఉంటుందని విజయం సాధించవచ్చన్న ధీమాతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో కాకుండా ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల తరఫున టికెట్లను పొందాలని ఇప్పటినుంచి నియోజకవర్గాల ఇన్చార్జిల చుట్టూ, స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ఆశావాహులు వారి ప్రయత్నాలను ఇప్పటి నుంచే ప్రారంభించి వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది.

కార్పొరేషన్, మున్సిపల్ వార్డుల్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఆశావాహులు ఉండగా ప్రధాన పార్టీల్లో టికెట్ దక్కని వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి వారి అదృష్టాన్ని ఈ ఎన్నికల్లో పరీక్షించుకొనున్నారు. ప్రధానంగా ఆర్మూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ పాలకవర్గం నాయకులందరూ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న పూర్వ నాయకులకు మాత్రమే 80 శాతానికి పైగా టికెట్లు కేటాయించాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన వారికి 20 శాతం మేర మాత్రమే టికెట్లు ఇవ్వాలని  డీసీసీలకు పిసిసి నుంచి  ఆదేశాలు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఇటీవల ఆర్మూర్లో పూర్వపు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి సమావేశాన్ని సైతం నిర్వహించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సైతం ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు తన గెలుపు కోసం బిజెపి పార్టీలో ఉండి పని చేసిన వారికే టికెట్లు ఇస్తానని ఇంతకుముందు వారి ముఖ్య కార్యకర్తల సమావేశంలో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీల కౌన్సిలర్ల టికెట్లు ఎవరికి దక్కనున్నాయోననే ఆర్మూర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.