9 May, 2026 | 1:29 AM

అత్తాపూర్‌లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

30-06-2025 02:46 AM
  1. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహణ

తరలివచ్చిన 10 వేల మంది భక్తులు

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) అత్తాపూర్ ఆధ్వర్యంలో ఆదివారం తమ 4వ వార్షిక శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గర్భగుడిలోని శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి బయటకు వచ్చి, దివ్య రథాలపై ఊరేగింపుతో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఈ రథయాత్ర అత్తాపూర్‌లోని ఇస్కాన్ ఆలయం నుంచి మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటలకు అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్ 173, సామ భూపాలరెడ్డి గార్డెన్స్ వద్ద ముగిసింది. సామ భూపాల రెడ్డి గార్డెన్స్ వద్ద హరినామ కీర్తనలు, శ్రావ్యమైన భజనలు ఉత్సాహభరితంగా నిర్వహించారు.

పౌరాణిక వైదిక పాత్రల తోలుబొమ్మలతో రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. భక్తులందరికీ చప్పన్ (56) భోగ నైవేద్య దర్శనం కల్పించారు. ఈ రథయాత్రకు పదివేల మంది భక్తులు తరలివచ్చారు. శ్రీకృష్ణుని పవిత్ర నామాలను పారవశ్యంతో పాడుతూ, నృత్యం చేస్తూ భక్తులు ఆనంద పరవశులయ్యారు.