calender_icon.png 25 September, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డు బియ్యం ఎలుకలపాలు!

25-09-2025 12:59:07 AM

  1. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ మొదలు
  2. మార్చి నాటికి మిగిలిన దొడ్డు బియ్యం నిల్వలు రేషన్ డీలర్ల వద్దే..
  3. స్టోరేజీకి జాగా లేక ముక్కిపోయి, ఎలుకల పాలవుతున్న వైనం
  4. స్టాక్ క్లియర్ చేయాలంటూ అధికారులకు రేషన్ డీలర్ల మొర
  5. మహబూబాబాద్ జిల్లాలో డీలర్ల వద్దే వెయ్యి క్వింటాళ్ల బియ్యం

మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సన్న బియ్యం పంపిణీతో రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఎలుకల పాలవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ర్ట ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. మార్చి నెలాఖరు వరకు రేషన్ కార్డులకు పంపిణీ చేయగా, మిగిలిన బియ్యం దుకాణాల్లోనే పేరుకు పోయాయి.

ప్రతినెల నిర్ధారిత రేషన్ కోట ప్రకారం మార్చి నెలాఖరు వరకు మహబూబాబాద్ జిల్లాలో రేషన్ షాపులకు పంపిణీ చేసిన బియ్యంలో సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు డీల ర్ల వద్ద మిగిలిపోయాయి. జిల్లాలో 550 మందికి పైగా రేషన్ డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా, దాదాపు అన్ని షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ లు ఉన్నట్టు తెలుస్తోంది. సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఆరు మాసాలు కావొస్తున్నా, రేషన్ షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వలను క్లియర్ చేసే విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

మిగిలిపోయిన దొడ్డు బియ్యానికి పురుగులు పడుతున్నాయని, ఎలుకలు తినడం, పంది కొక్కులు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని, ఇప్పటికే చాలావరకు బియ్యం ఎలుకల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద మార్చి నెలాఖరు వరకు రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయగా మిగిలిన స్టాక్ వివరాలను అధికారులకు చెప్పామని, ఇప్పుడు అందులో కొంత ఎలకలపాలు అయిందని, ఇప్పుడు అధికారులు బియ్యం కోసం వస్తే తరుగు ఎవరు భరిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా రేషన్ షాపులతో పాటు, ఎమ్‌ఎల్‌ఎస్ గోదాముల్లోనూ దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్టు చెబుతున్నారు. కొందరు రేషన్ డీలర్లు తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని కాపాడేందుకు నానా తంటాలు పడుతున్నారు. దొడ్డు బియ్యంలో పోషక విలువలు ఉన్న (ఫోర్టిఫైడ్ రైస్) బియ్యం కలపడంతో త్వరగా పురుగు పడుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. 

స్టాక్ దింపుకొనే పరిస్థితి లేదు..

ఇప్పటికే ఇరుకు గదుల్లో రేషన్ షాపులను నిర్వహిస్తుండగా దొడ్డు బియ్యం నిల్వలతో కొత్తగా సన్న బియ్యం స్టాక్ దింపుకొనే పరిస్థితి లేదని, ఒకవేళ దింపుకున్న పురుగు పట్టిన దొడ్డు బియ్యం.. సన్న బియ్యంతో కలవడంతో కొత్త బియ్యానికి కూడా పురుగు పడుతుందని చెబుతున్నారు. గ్రామాల్లో చాలా చోట్ల ప్రైవేటు వ్యక్తుల ఇండ్లల్లో రేషన్ షాపు లు నిర్వహిస్తుండగా కొన్నిచోట్ల రేషన్ డీలర్ల ఇంట్లోనే నిర్వహి స్తున్నారు.

దొడ్డు బియ్యం నిల్వలకు పట్టిన పురుగులు ఇంట్లోకి వస్తున్నాయని, దీఃతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. దొడ్డు బియ్యం నిల్వలు ఒక పక్కన ఉంచినప్పటికీ, కొత్తగా సన్న బియ్యం స్టాక్ రాగానే వాటి పక్కనే వేస్తూ ఉండటంతో అందులోని పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని, దీంతో సన్న బియ్యం తీసుకెళ్లే లబ్ధిదారులు పురుగులను చూసి తమకు పురుగు పట్టిన బియ్యం ఇస్తున్నారని పంచాయితీకి దిగుతున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు.

దొడ్డు రేషన్ బియ్యం స్టాక్ వివరాలను ఇప్పటికే జిల్లా అధికారులకు అందజేశామని, దొడ్డు రేషన్ బియ్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు ఏకరువు పెట్టామని, అయినప్పటికీ ఇప్పటివరకు క్లియరెన్స్‌పై ఎలాంటి చర్యలు లేవని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వలను త్వరగా తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దొడ్డు బియ్యం నిల్వలను ఇలాగే ఉంచితే రేషన్ షాపుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త బియ్యం పాడవుతున్నాయి..

రేషన్ షాపులో 43 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలను తొలగించాలని అధికారులకు వినతులు ఇచ్చాం. కొత్తగా సన్న బియ్యం నిల్వలను రేషన్ షాప్ లో దిగుమతి చేసుకోవడం వల్ల పాత బియ్యం పురుగులు కొత్త బియ్యానికి పడుతున్నాయి. దీంతో కొత్త బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రజలు పురుగులను చూసి, మాకు చీవాట్లు పెడుతున్నారు. పాత బియ్యం తొలగించి ఇతర చోటికి మార్చే పరిస్థితి లేదు. కొత్తబియ్యం వేరే చోట దించుకోనే అవకాశమూ లేదు. ఉన్నది కొద్దిపాటి స్థలం. పాత బియ్యం కొత్తబియ్యంతో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అధికారులు స్పందించి దొడ్డు బియ్యం స్టాక్‌ను వెంటనే క్లియర్ చేయాలి. 

 రావుల జయశ్రీ, రేషన్ డీలర్, కాట్రపల్లి

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

రేషన్ షాపుల్లో పేరుకుపోయిన దొడ్డు బియ్యం నిల్వల తొలగింపు అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే రేషన్ డీలర్లు కూడా సమస్యను మా దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం రాష్ర్ట అధికారులకు సమా చారం ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే దొడ్డు బియ్యం నిల్వలను తొలగిస్తాం.

 సత్యనారాయణ, 

డీటీ, సివిల్ సప్లయ్