calender_icon.png 25 September, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామీజీ లైంగిక వేధింపులు

25-09-2025 12:46:56 AM

  1. ‘ఢిల్లీ’ శ్రీశారద విద్యాసంస్థ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతిపై ఫిర్యాదు
  2. పోలీసులను ఆశ్రయించిన 17 మంది విద్యార్థినులు
  3. తన గదికి రావాలని స్వామీజీ సందేశాలు పంపించాడని ఆధారాల సమర్పణ 
  4. పరారీలో స్వామీజీ.. డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన సంస్థ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: న్యూఢిల్లీలోని శ్రీశారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ కాలేజీ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై (స్వామి పార్థసారథి) లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమకు అసభ్య సందేశాలు పంపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడడని 17 మంద విద్యార్థినులు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు నిర్వహించామని వెల్లడించారు. విద్యాసంస్థ భవనం బేస్‌మెంట్‌లో ఒక కారు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. కారు నంబర్ ప్లేట్‌ను తనిఖీ చేయగా.. అది నకిలీదని తేల్చారు. స్వామీజీ మహిళా అధ్యాపకులను సైతం వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు వారందరి వాంగ్మూలాలు తీసుకుని స్వామీజీపై కేసు నమోదు చేశారు. ఒడిశాకు చెందిన చైతన్యానంద సరస్వతి కేసులు నమోదు కావడం ఇదేమీ మొదటిసారి కాదు. 2009లోనే ఆయనపై మోసం, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. స్వామీజి మొదటి నంచీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులను టార్గెట్ చేసేవాడు. తాజాగా తమ విద్యాసంస్థలో ఉపకార వేతనాలతో చదువుతున్న విద్యార్థినులకు మెసేజ్‌లు పంపించేవాడు.

యువతులకు బెదిరింపు సందేశాలు..

స్వామి చైతన్యానంద సరస్వతి విద్యార్థినులకు అసభ్యకర మెసేజులను పంపించాడు. ఆశ్రమానికి చెందిన 50 మంది యువతుల ఫోన్లలో స్వామీజీ పంపిన మెసేజులు ఉన్నాయి. ‘నా గదికి వస్తే ఫారిన్ ట్రిప్‌కు తీసుకెళ్తా.. నీవు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు’, ‘నువ్వు నా మాట వినకపోతే నిన్ను పరీక్షల్లో ఫెయిల్ చేస్తా’ అని స్వామీజీ యువతులను బెదిరించినట్టు ఆధారాలున్నాయి.