calender_icon.png 25 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట్ల ఆమ్యామ్యాలు మింగిన అధికారులు సుఖీకి బంట్లు!

25-09-2025 01:52:18 AM

పుప్పాలగూడలో ఉబుంటు ఆడిందే ఆట

  1. బుల్కాపూర్ నాలాను సమాధి చేసి, రేడియల్ రోడ్డును చీల్చి మరీ అక్రమ నిర్మాణం
  2. కళ్లు మూసుకున్న హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు
  3. వందల కోట్ల ప్రజా సంపదకు ఎసరు పెడుతున్న రియల్ మాఫియా

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ ౨౪ (విజయక్రాంతి) : అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి.. అది ప్రజా రహదారి.. దాని పై బడా బిల్డర్ కన్నుపడింది. తమ ప్రాజెక్టుకు అది అడ్డొచ్చింది. వెంటనే కోట్ల రూపాయల కమీషన్ల గంగ ప్రవహించింది. అధికారగణం ఆ ముడుపుల మత్తులో మునిగింది. ఇంకేముంది, చట్టా లు చుట్టాలయ్యాయి.. నిబంధనలు నీరుగారిపోయాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్వర్గధామం పుప్పాలగూడలో ‘సుఖీ గ్రూప్’ సాగిస్తున్న అక్రమ నిర్మాణా ల బాగోతం వెనుక ఉన్న అసలు సూత్రధారులు అవినీతి అధికారులేనని తేటతెల్ల మవుతోంది.

చారిత్రక బుల్కాపూర్ నాలాను నామరూపాల్లేకుండా పూడ్చివేసి, అత్యంత కీలకమైన రేడియల్ రోడ్డు ను అడ్డంగా చీలిస్తుంటే.. హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక వందల కోట్ల అవినీతి బాగోతం దాగి ఉం దన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మహా విధ్వంసంపై ‘విజయక్రాంతి’ పత్రిక సెప్టెంబర్ 11న ‘సుఖీభవ’ శీర్షికతో ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించినా, పాలకుల్లో గానీ, అధికారుల్లో గానీ చలనం లేకపోవడం బడా బిల్డర్‌తో వారి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తోంది.

ఒకప్పుడు జీవనాడి.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పునాది..

ఒకప్పుడు శంకరపల్లి నుంచి మూసీ వరకు వందలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందించి, పర్యావరణాన్ని కాపాడిన బుల్కాపూర్ నాలా, నేడు ‘సుఖీ ఉబుంటు’ ప్రాజెక్టు కింద సమాధి అయిపోయింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 414, 416, 417, 428 తదితర ప్రాంతాల్లో ఈ నాలా ప్రవహించిన ఆనవాళ్లను పూర్తిగా చెరిపేసి, వేల కోట్ల విలువైన భూమిని సృష్టించారు.

పర్యావరణ చట్టాల ప్రకారం నాలాకు ఇరువైపులా 100 మీటర్ల బఫర్ జోన్ వదిలివేయాలి. కానీ ఇక్కడ కనీసం పది అడుగుల దూరం కూడా పాటించకుండా, 36 అంతస్తుల మూడు భారీ టవర్ల నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతులిచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రికార్డుల్లో పదిలంగా ఉన్న నాలా, క్షేత్రస్థాయిలో కనుమరుగైపోతుంటే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అభివృద్ధికి రహదారి.. బిల్డర్‌కు పెరటిదారి..

పశ్చిమ హైదరాబాద్ ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు, ఐటీ కారిడార్‌కు మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం వందల కోట్లతో నిర్మించిన నార్సింగి-, కొల్లూరు ఇంటర్‌చేంజ్‌లను కలిపే రేడియల్ రోడ్ నంబర్ 5, నేడు ‘సుఖీ’ బిల్డర్ పాలిట సొంత జాగాలా మారింది. తన 5 ఎకరాల ప్రాజెక్టులోకి 867 కుటుంబాలు సువిశాలమైన ప్రవేశమార్గం కోసం, హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, ఇంజనీరింగ్ నిబంధనలను కాలరాసి రోడ్డును అడ్డంగా చీల్చేశారు.

దీనివల్ల భవిష్యత్తులో ఈ మార్గంలో వేగంగా వెళ్లే వాహనాలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని, సమీపంలోని త్రివేణి టాలెంట్ స్కూల్, ఏఎమ్‌వీ హాస్పిటల్‌కు వెళ్లే వారికి ఇది ప్రాణసంకటంగా మారుతుందని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం చోద్యం చూస్తుండటం వారి చేతులు ఎంతగా తడిశాయో చెప్పకనే చెబుతోందని స్థానికులు అంటున్నారు.

అక్రమమని తేలితే

పుప్పాలగూడ ప్రాజెక్ట్ వద్ద రేడియల్ రోడ్డును అక్రమంగా కట్ చేశారని ఫిర్యాదులు అందాయి. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ బృం దాలు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నివేదిక సమర్పిస్తాయి. అక్రమమని తేలితే, నిబంధనల ప్రకారం బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్డును తిరిగి యథాస్థితికి తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేస్తాం.

 బీ. ప్రసాద్ రావ్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, హెచ్‌ఎండీఏ

మా బతుకులతో చెలగాటమా?

అభివృద్ధి కోసం మా భూములిస్తే, ఆ అభివృద్ధి మా ఉసురు తీసేలా ఉంది. కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఫిర్యా దుల మీద ఫిర్యాదులు ఇస్తున్నాం. ‘చూస్తాం, చేస్తాం’ అంటారే తప్ప ఒక్క అధికారి కూడా ఇటువైపు రాలే దు. నిరుపేదవాడు గోడ కడితే కూల్చేసే ఈ వ్యవస్థ, ఒక బడా బిల్డర్ నాలాను, రోడ్డును మింగేస్తుంటే ఎందుకు చూసీచూడనట్టు నటిస్తోంది?

రేపు నిర్మాణాలు పూర్తయ్యాక, మా లాంటి మధ్యతరగతి వాళ్లకు ఫ్లాట్లు అమ్మి బిల్డర్ చేతులు దులుపుకుంటాడు. ఆ తర్వాత ప్రభుత్వం కూల్చి వేతలకు వస్తే, లక్షలు పోసి కొన్న మా గతేంటి? ఈ అన్యాయాన్ని ప్రశ్నించేవారే లేరా?  అధికారుల ప్రకటనలు కేవలం ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకే తప్ప, అక్రమాలను అడ్డుకునేందుకు కాదు ఇప్పటికై నా రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి,

ఈ  కబ్జాపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి. కేవలం బిల్డర్ పైనే కాకుండా, ఈ అక్రమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క అవినీతి అధికారిని చట్టం ముందు నిలబెట్టి, ప్రజా సంపదను కాపాడాలని ప్రజ లు ముక్తకంఠంతో కోరుతున్నారు. లేనిపక్షంలో, ఈ అక్రమ నిర్మాణం హైదరాబా ద్‌కు మరో మాయని మచ్చగా, అవినీతికి స్మారక చిహ్నంగా మిగిలిపోవడం ఖాయం.

 ప్రకాష్, అల్కాపూర్ టౌన్‌షిప్ రెసిడెంట్ అసోసియేషన్ సభ్యుడు