25-09-2025 12:53:07 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 78 రోజుల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఈ బోనస్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లు కేటాయించింది. కాగా నాన్‌గెజిటెడ్ గ్రూప్ సీ, గ్రూప్ డీ (లెవెల్ 1 స్టాప్) ఉద్యోగులకు ఈ ఉత్పాదకత సంబంధిత బోనస్ (పీఎల్‌బీ) వర్తిస్తుంది. రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్‌షాప్‌లు, ఇతర సహాయ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకూ ఈ బోనస్ అందనుంది. ప్రతీ సంవత్సరం లాగే ఈసారీ కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
అర్హత కలిగిన ప్రతీ రైవ్లే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ కింద గరిష్ఠంగా రూ.17,951 చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, సాంకేతిక నిపుణులు, సహాయకుకలు, పాయిట్స్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది తదితర పనుల్లో ఉన్నవారికి వర్తిస్తుంది.
పరిశోధనలకు రూ.2,277 కోట్లు
పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ.2,277 కోట్లను కేటాయిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎస్‌ఐఆర్ పథకం కింద మానవ వనరుల అభివృద్ధికి ప్రోత్సహం కల్పించనున్నట్టు ప్రకటించివంది. సాహెబ్‌గంజ్-బెట్టయ్య ఎన్‌హెచ్- 139 నాలుగు లైన్ల 79 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి ఆమోదం తెలిపింది.
దీని కోసం రూ.3,8,22 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే భక్తియార్‌పూర్-రాజ్‌గిర్-తలయ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 104 కి.మీ. మేర డబ్లింగ్‌కు రూ.2,192 కోట్లు ఖర్చుపెట్టనుంది. దీంతో పాటు సముద్ర రంగ అభివద్ధికి సైతం రూ.69,725 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.