calender_icon.png 25 September, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ద్రోహి కాంగ్రెస్

25-09-2025 01:37:47 AM

ప్రజా ద్రోహి బీజేపీ

యూరియా అడిగితే రైతులపై థర్డ్ డిగ్రీ

  1. ఇదేనా రాహుల్ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’
  2. జీఎస్టీ పేరుతో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నందుకు పండుగ చేసుకోవాలా? 
  3. చంద్రబాబు కోసమే మేడిగడ్డను పట్టించుకోని కోవర్టు రేవంత్ 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
  5. బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కరీంనగర్‌కు చెందిన డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమిరెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పని తనానికి నిదర్శనమన్నారు. ఇక జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ. 15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోదీ, ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి (సీనియర్ గైనకాలజిస్ట్) బుధవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.

యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారని, సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాష్టికాన్ని తాము వదిలిపెట్టమని, ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అని ప్రశ్నించారు.  

వాటి ధరలు తగ్గిస్తే పండుగ చేసుకుంటాం  

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.  నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది అని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయినా దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. రూ.350 ఉన్న సిలిండరును రూ.1200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారని, వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారని తెలిపారు. 

మోదీ, చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. 

నాయకులుగా తామే విఫలమయ్యాం 

గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదని, నాయకులుగా తామే విఫలం అయ్యామని కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ సీఎం చేయనంతగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని, కానీ పదేళ్లలో మనం చేసిన పనులను ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయామన్నారు. నాయకులుగా మనమందరం విఫలమయ్యామని, ‘మోసపోతే గోసపడతాం’ అని కేసీఆర్ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. ‘స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అన్న జయశంకర్ సార్ మాటలను నిజం చేయాలన్నారు.  

‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ ద్రోహం 

కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించిన గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.  అభయహస్తం డిక్లరేషన్‌లో గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని  డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ బృందం సభ్యులు కేటీఆర్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... గిగ్ వర్కర్స్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.  గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తే బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.